వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వైఎస్ జగన్ ఆవేశమే ఆయనకు చాలా మందిని అభిమానులను చేసింది. వైఎస్ చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆవేశాన్ని కూడా ప్రదర్శించాడు జగన్. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరు తెచ్చుకున్న కెవిపి రామచంద్రరావు మాటలు కూడా జగన్ చెవికి ఎక్కలేదు. కాంగ్రెస్ పార్టీతో విభేదాలు తెచ్చుకుని హీరో అయ్యాడు జగన్. దేశాన్ని శాసిస్తున్న సోనియాగాంధీతో పులివెందుల పులిబిడ్డ పోటీ అంటూ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కున్నాడు. ఆ వెంటనే తన ఆవేశానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది జగన్. సోనియాగాంధీలాంటి పవర్ఫుల్ నేతతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. ఆ తర్వాత మాత్రం కాస్త ఆవేశం తగ్గించుకున్నాడు. ఒక్క చంద్రబాబునాయుడిని విమర్శించే విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ సౌమ్యంగానే ఉంటూ వచ్చాడు. అలాగే నరేంద్రమోడీ, కెసీఆర్లాంటి నాయకులతో సన్నిహిత సంబంధాలే కోరుకుంటున్నాడు. జగన్‌లో వచ్చిన ఈ మార్పు కొంతమందికి బాగానే అనిపించింది కానీ…జగన్‌ని పులివెందుల పులిబిడ్డలా చూడాలనుకున్నవాళ్ళకు మాత్రం నిరాశ కలిగించింది. రాజకీయాలు ఎలా ఉంటాయో జైలు జీవితం సమయంలోనే అవగాహన తెచ్చుకున్న జగన్ మాత్రం జాగ్రత్తపడ్డాడు. అయితే మళ్ళీ ఇప్పుడు తన యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్‌ని బిల్డప్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టున్నాడు జగన్.
ఏ రోజు ఉద్యమం చేస్తున్నారు….ఎక్కడ ఎలుగెత్తి చాటుతున్నారు అనే విషయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. విశాఖలో చేపట్టిన పోరాటాన్ని చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అణచి వేసి ఉండొచ్చు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం చంద్రబాబు విలన్ అయ్యాడు. పోరాటానికి మద్ధతు పలికిన అందరూ హీరోలు అయ్యారు. వైఎస్ జగన్‌కి కూడా ఆ పోరాటం రాజకీయంగా బాగానే కలిసి వచ్చి ఉండేది. కానీ ఎయిర్ పోర్ట్‌లో ఆవేశపడిపోయిన జగన్…తన ఇమేజ్‌ని కాస్త డ్యామేజ్ చేసుకున్నాడు. ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పి….జగన్ కూడా తప్పులు చేస్తే ఇద్దరూ సమానమే అవుతారుగా. అలాగే ఇప్పుడు దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆవేశంతో తప్పులు చేశాడు జగన్. టిడిపి పార్టీ ఎంపిగా…చంద్రబాబును ఆకాశానికెత్తుతూ…జగన్‌ని నోటికొచ్చిన బూతులతో తిడుతున్న జెసి దివాకర్‌రెడ్డి అంటే చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందనడంలో సందేహం లేదు. జెసి దివాకర్‌రెడ్డికే చెందిని ఈ బస్సు ప్రమాదం కేసును చంద్రబాబు నీరుగారుస్తాడనడంలో కూడా సందేహం లేదు. అలాంటి సందర్భంలో వైఎస్ జగన్ కాస్త సంయమనంతో వ్యవహరించి ఉంటే బాగుండేది. కలెక్టర్‌ని జైలుకు పంపిస్తా అనడం, ప్రభుత్వ ఉద్యోగుల పైన విరుచుకుపడడంలాంటి తప్పులు చేసి తానే విలన్ అయ్యే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం జగన్ బాధ్యత. కానీ ఆ తప్పులు ఎత్తి చూపే విధానం సినిమాలలో రాజశేఖర్, సాయికుమార్‌ల హీరోయిజంలా ఆవేశంగా ఉండాల్సిన అవసరం లేదు. అసలే చంద్రబాబు నుంచీ టిడిపి నాయకులందరూ కూడా జగన్‌కి అనుభవం లేదు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటారు. 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి అది కూడా ఓ కారణం. జనాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ జగన్ ఇలానే ఆవేశపడిపోతూ ఉంటే జగన్ అనుభవలేమి మరికాస్త ఎక్కువగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల తరపున పోరాడుతున్నాడు అనే ఇమేజ్ దక్కకపోగా ఆవేశపరుడు అన్న బ్రాండ్ పడిపోతుంది. అదే జరిగితే జగన్ రాజకీయ భవిష్యత్‌కి ఏ స్థాయిలో ప్రమాదం ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని……పులివెందల పులిబిడ్డలా కాకుండా…….ఆలోచన ఉన్న నాయకుడిగా ప్రజలకు కనిపిస్తే జగన్‌కే మంచిది.
పాదయాత్ర ముందు వరకూ కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపైన ఫ్యాక్షనిస్ట్, ఆవేశపరుడు అనే ముద్ర ఉండేది. ఆ ముద్ర రాజశేఖర్‌రెడ్డి పొలిటికల్ కెరీర్‌కి బాగానే నష్టం చేసింది. ఆ విషయం తెలుసుకునే రాజశేఖర్‌రెడ్డి చాలా మారాడు. ఆ తర్వాతే ప్రజల మెప్పు పొందాడు. ప్రతి విషయంలోనూ నాన్న జపం చేస్తూ ఉండే వైఎస్ జగన్….ఈ ఆవేశం అనర్థం అన్న నీతిని కూడా వైఎస్ రాజశేఖర్ నుంచి నేర్చుకుంటే అది ఆయనకే మంచిది.