” నిమ్మగడ్డ రమేష్ కుమార్” అనే వ్యక్తిని మేము రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించ లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్ ని, బాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. అధికారి అనే వ్యక్తి నిష్పాక్షికంగా పని చేయాలి కానీ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయి నిర్ణయాలు తీసుకున్నారు’ – ఇవీ ప్రెస్ మీట్ లో జగన్ చేసిన వ్యాఖ్యలు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులకు కూడా అంటగడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. అనేక దేశాలు, భారతదేశంలోని అనేక ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ ప్రతిస్పందించిన తీరు తీవ్ర విస్మయాన్ని కలిగించింది.
ఎన్నికలు వాయిదా నిర్ణయాన్ని తప్పు పట్టిన జగన్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది , తద్వారా చంద్రబాబు పరిస్థితి మరింత దిగజారి పోతోందని అర్థమైన కారణంగానే రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేశాడు అంటూ జగన్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంత పెద్ద ఆర్డర్ ఎన్నికల కమిషనర్ తయారు చేసిన సంగతి ఎన్నికల కమిషన్ లోని సెక్రటరీకి కూడా తెలియదు అని, దానర్థం ఎవరో తయారు చేసిన ఆర్డర్‌ను ఎన్నికల కమిషనర్ చదివి వినిపించాడు అని జగన్ అన్నారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన కమిషనర్ విచక్షణ కోల్పోయారు అని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 31వ తేదీ లోపల పూర్తయితే రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నుండి ఐదు వేల కోట్ల రూపాయలు వస్తాయని, అవి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని, అలా కాకుండా ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేయడం ద్వారా ఆ డబ్బులు రాష్ట్రం కోల్పోతుందని జగన్ అన్నారు.
అధికారులను సస్పెండ్ చేయడంపై జగన్ విమర్శలు:
టిడిపి నేతల పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త కి స్టేషన్ బెయిల్ ఇచ్చిన కారణంగా మాచర్ల సీఐ పై ఎన్నికల అధికారి సస్పెన్షన్ వేటు వేశారు. అదే విధంగా మరి కొందరు అధికారుల పై కూడా ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల అధికారికి ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నించారు. 151 స్థానాలలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్య మంత్రిని కాదని ఎన్నికల అధికారి మొత్తం అధికారాలు తీసుకుంటారా అంటూ జగన్ ప్రశ్నించారు. అసలు అధికారం ముఖ్యమంత్రిదా లేక ఎన్నికల కమిషనర్ దా అంటూ ఆయన ప్రశ్నించిన తీరు కాస్త హాస్యాస్పదంగా అనిపించింది. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అధికార పరిధిలో వారి అధికారాలు నిర్వర్తించవలసి ఉంటుందన విషయం ఆ సమయానికి బహుశా జగన్ కి గుర్తు వచ్చినట్టు లేదు.
ఏకగ్రీవాల ను సమర్థించుకున్న జగన్
రాష్ట్రంలో ఏకగ్రీవం అంటూ ఒక ప్రహసనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విపక్ష నేతలు నామినేషన్లు వేయకుండా వారిని బెదిరించడం , దాడులు చేయడం వంటి చర్యల ద్వారా ఏకగ్రీవాలు జరుగుతున్నాయంటూ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ దీనిని సమర్థించుకున్నారు. 2013లో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకుంటే అప్పుడు ఈనాడు పత్రిక దానిని ప్రశంసిస్తూ వార్తలు రాసింది అంటూ 2013 నాటి ఈనాడు పత్రికను చదివి వినిపించారు. ఏకగ్రీవాలు జరగడం కొత్త కాదని జగన్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని కేవలం నలభై మూడు చోట్ల మాత్రమే చిన్న చిన్న సంఘటనలు జరిగాయని ఇలాంటివి సాధారణమేనని జగన్ అన్నారు.
మొత్తానికి జగన్ ప్రెస్ మీట్ ఆద్యంతం ఆయనలోని ఒక ఫ్రస్ట్రేషన్ జనాలకు కనిపించింది. 6 వారాలు వాయిదా వేసినంత మాత్రాన కరోనా తగ్గుతుందా అంటూ ఆయన ప్రశ్నించిన తీరు చూస్తుంటే, అటు కరోనా వచ్చి జనాలు చచ్చినా సరే ఎన్నికలు జరగాల్సిందే అన్న మంకుపట్టు కనిపించింది. ఎన్నికల కమిషనర్ కు కులం ఆపాదించడం ముఖ్యమంత్రి స్థాయికి తగిన చర్య లా అనిపించలేదు. విపక్ష పార్టీలు జగన్ ప్రెస్ మీట్ పై ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.