విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ… కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.. ప్రభుత్వానికి ఐదుగురు మాత్రమే ఉన్నట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా యాభై మంది రోగులు.. పది మంది సిబ్బంది ఉన్నారు. అగ్నిప్రమాదం తర్వాత రోగుల్ని వదిలేసి సిబ్బంది పరారయినట్లుగా తెలుస్తోంది. వారందరూ క్షేమంగానే ఉన్నారు. రోగులు మాత్రం… ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయారు. క్షణాల్లోనే మంటలు విస్తరించడంతో కోవిడ్ రోగులు తేరుకోలేకపోయారు. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదంపై… ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాద కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరో వైపు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… ఈ ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యలు తీసుకున్నామని.. మృతుల కుటుంబాలకు రూ. యాభై లక్షల నష్టపరిహారం ప్రకటించామని ముఖ్యమంత్రి మోడీకి చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్లో వరుస ప్రమాదాలు… ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో చోట… భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవస్థలో పేరుకుపోయిన నిర్లక్ష్యం… ప్రభుత్వ యంత్రాంగం… పూర్తిగా లైట్ తీసుకోవడం… వంటి కారణాల వల్ల… ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కరోనా కారణంగా ప్రాణభయంతో ఆస్పత్రిలో చేరిన వారిని మంటలకు వదిలి పెట్టేసింది ఆస్పత్రి యాజమాన్యం. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.