ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ పదిన్నర తర్వాత ఖరారయింది. మద్యాహ్నమే విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన జగన్… అమిత్ షా తో భేటీ కోసం తనతో పాటు మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు.. ఇటీవలే పదవి ఇచ్చిన జాస్తి నాగభూషణ్ను వెంటబెట్టుకుని వెళ్లారు. అయితే అమిత్ షా.. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వరన్న ప్రచారం ఉంది. కానీ జగన్ కు మాత్రం పదిన్నరకు ఖరారు చేశారు. అధికారిక విషయాలు అంత రాత్రి సమయంలో మాట్లాడరని.. రాజకీయాలపైనే మాట్లాడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే.. ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే జగన్ వెళ్లారని రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పుకొచ్చారు. సజ్జల పనిగట్టుకుని మరీ రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పడానికి కారణం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. జగన్ ఢిల్లీ పర్యటనతో ఏపీ బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. తమతో మైండ్ గేమ్ ఆడేందుకే.. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యనటకు వెళ్లారని అనడం ప్రారంభించారు. విష్ణువర్ధన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారు. బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకే జగన్ ఢిల్లీ వెళ్లి బేటీలు అవుతున్నారని అంటున్నారు.
అయితే.. ఏదో అత్యవసర విషయం ఉండబట్టే.. అమిత్ షాను జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారని.. అంత రాత్రి అయినా అపాయింట్మెంట్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. ఆ ఇంపార్టెంట్ విషయం ఏమిటనేదానిపైనే ఇప్పుడు ఆసక్తి ఏర్పడింది. రేపటి నుంచి అమిత్ షా … బెంగాల్ ఎన్నికల విషయంలో బిజీగా ఉంటారు. అందుకే.. ఈ రోజే ఎంత రాత్రి అయినా అపాయింట్ మెంట్ ఖరారు చేశారని అంటున్నారు.