నేషనల్ సిటిజన్ షిప్ రిజిస్ట్రీకి ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కోసం ఏపీ సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. విజయవాడలో ముస్లింలు, క్రిస్టియన్స్ ఇతర సంఘాలు కలిసి సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీ సభను నిర్వహించాయి. ఈ సభ బాధ్యతను టీడీపీ ఎంపీ కేశినేని నాని తీసుకున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ముఖ్యఅతిథిగా సభకు హాజరయ్యారు. ఈ సభలో.. ఏపీ సర్కార్.. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న డిమాండ్ ముక్త కంఠంతో వినిపించింది. ఎంపీ కేశినేని నాని… జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టండి..టీడీపీ ఎమ్మెల్యేలు లు దానికి మద్దతు తెలుపుతారుని… కేశినేని ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యేల మద్దతుకు తాను హామీ ఇస్తున్నానన్నారు.
అసదుద్దీన్ అసెంబ్లీలో తీర్మానంతో పాటు.. ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి సీఏఎ,ఎన్నార్సీ అమలు చేయకుండా స్టే తేవాలని డిమాండ్ చేశారు. అనేక మంది మత ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు. అందరూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఓ వైపు అసెంబ్లీ తీర్మానం కోసం డిమాండ్లు పెరుగుతూండగా.. కర్నూలులో తనను కలసిన ముస్లిం పెద్దలకు జగన్మోహన్ రెడ్డి నిరాశాజనక సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేయక తప్పదని.. అయితే ముస్లింలు ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని అంటున్నారు. కొన్నాళ్ల కిందట.. కడప జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు.. ఎన్నార్సీని అమలు చేయబోనని జగన్ హామీ ఇచ్చారు.
కర్నూలులో జగన్మోహన్ రెడ్డి స్పందనపై ముస్లిం సంఘాల స్పందనేమిటో తెలియదు కానీ.. అసంబ్లీలో ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం చేయడం మాత్రం సాధ్యం కాదని పరోక్షంగా చెప్పినట్లయిదంటున్నారు. అయితే.. ముస్లిం వర్గాలు.. మాత్రం.. ఎన్నార్సీని అమలు చేస్తానంటే.. కామ్ గా ఉండే అవకాశాలు లేవు. ఇప్పటికే.. ఎన్నార్సీపై ముందుకెళ్తే రాజీనామా చేస్తానని.. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా ప్రకటించారు. దీంతో.. ఈ విషయం.. ఏపీ సర్కార్కు రానున్న రోజుల్లో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.