వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి … ఏపీకి చెందిన ఎంపీలతో సమావేశం పెట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. సాధించాల్సిన ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు. ఇరవై రెండు మంది లోక్‌సభ ఎంపీలు.. ఆరుగురు రాజ్యసభ ఎంపీలతో వైసీపీ బలంగా ఉంది. సంఖ్యాపరంగా టాప్ ఫైవ్ పార్టీల్లో ఒకటి. అలాంటి పార్టీ తమ సొంత రాష్ట్రానికి మేలు చేసేందుకు… ఆ బలాన్ని ఉపయోగించుకుంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు.
ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎంపీలు … తమకు అది రావాలని.. ఇది కావాలని కేంద్రాన్ని ఎప్పుడూ పట్టుబడుతూ ఉండేవారు. దానికి తగ్గట్లుగా కొన్ని విద్యా సంస్థలు.. ప్రాజెక్టులు వచ్చాయి. కానీ గత రెండేళ్లుగా గతంలో మంజూరైన ప్రాజెక్టులకు నిధులు కూడా విడుదల కావడం లేదు. గిరిజన వర్శిటీ కోసం నిధులు బడ్జెట్లో పెట్టినా పనులు ప్రారంభం కాని పరిస్థితి. చివరికి రైల్వేజోన్‌ను అధికారంగా ప్రకటించినా అమలు చేయించుకోలేని నిస్సహాయత. ఇక నిధుల సంగతి చెప్పుకోకపోవడమే మంచిదన్నట్లుగా ఉంది పరిస్థితి. పోలవరం గురించి…చెప్పుకుంటే.. ప్రతీ ఆంధ్రుడికి కన్నీరొస్తాయి.కేంద్రం నుంచి ఇంత దారుణమైన నిరాదరణ ఉన్నా ఎంపీలు చేసిందేమీ లేదు.
విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు పని చేస్తారు. వారు చేయమన్నదే చేస్తారు. కానీ.. వారిద్దరూ… రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నాలను ఇప్పటి వరకూ చేయలేదు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే అన్ని రకాల బిల్లులకు బేషరతుగా మద్దతు పలుకుతారు. బయటకు వచ్చి వ్యతిరేకిస్తున్నామని తమ రాజకీయం కోసం చెప్పినా సరే.. లోపల మాత్రం మద్దతిస్తారు. అలాంటి బేషరతు మద్దతు ప్రకటించినప్పటికీ.. కేంద్రం నుంచి తమకు ఏం కావాలనో నిర్భయంగా అడగలేకపోతున్నారు. ప్రత్యేకహోదా కోసం నిలదీయాల్సినంత బలం ఉన్నప్పటికీ… ఒక్కసారంటే ఒక్క సారి కూడా హోదా కోసం పార్లమెంట్లో ఆందోళన చేసే ప్రయత్నమూ చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ఎంపీలపై గురుతరమైన బాధ్యత పెట్టారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఏమీ తీసుకురాలేకపోయిందని చేసిన ప్రచారాన్ని నమ్మారు. వైసీపీ ఎంపీలు అంతకు మించి తీసుకు వస్తారన్న నమ్మకంతో ఓట్లేశారు. కానీ తీరా గెలిచిన తర్వాత వారి అంచనాలు కాదు కదా.. కనీసం ప్రయత్నాలు చేయడం మానేశారు. ఇది ప్రజల్లో చర్చకు కారణం అవుతోంది. ఓట్లు వేయించుకున్నంత కాలం చెప్పేది ఏమిటి… ఆ తర్వాత చేస్తున్నదేమిటన్న చర్చ ప్రారంభమవుతోంది. అందుకే వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడి..కనీసం కొన్ని అంశాల్లో అయినా అనుకూల ఫలితాలు సాధించాలి. లేకపోతే ఎంపీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకునే ప్రమాదం పొంచి ఉంటుంది.