రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జయహో బీసీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చారు. వెనకబడిన కులాల స్థాయిని పెంచే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, దీనికి కౌంటర్ గా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా బీసీ గర్జన సభ పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఈ మేరకు వైకాపా బీసీ నేతలతో జగన్ సమావేశమై చర్చించారు. ఫిబ్రవరి మూడో వారంలో పెద్ద ఎత్తున బీసీ గర్జన సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, సభా నిర్వహణ తేదీతోపాటు, వేదిక ఎక్కడ ఉంటుందీ అనేది ఇంకా స్పష్టత రావాల్సింది ఉంది.
ఇదే అంశమై వైకాపా నేత పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ… రాజమండ్రి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చారన్నారు. మరోసారి అధికారం దక్కించుకోవాలన్న యావతోనే తప్ప, బీసీలపై ఆయనకి నిజమైన ప్రేమ లేదని ఆరోపించారు. బీసీ యువతను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దితే, వారి జీవన ప్రమాణాలు బాగుపడతాయని నాడు వైయస్సార్ నూరు శాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ ప్రకటించారన్నారు. ఈరోజున కనీసం 30 శాతం కూడా ఫీజు రీఎంబర్స్ జరగడం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో నూటికి నూరుశాతం ఫీజు రీఎంబర్స్ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పలేకపోయారని పార్థసారధి అన్నారు. బీసీల జీవితాల్లో మార్పు తీసుకుని రావాలనే ఉద్దేశం సీఎంకి ఉండదనీ, వారి ఓట్లపై మాత్రమే ధ్యాస ఉంటుందని విమర్శించారు.
టీడీపీ నిర్వహించిన సభపై వైకాపాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. జగన్ నుంచి కాపీ కొట్టారని కూడా కొంతమంది వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఓపక్క ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని, బీసీలకు తక్షణం మేలు జరిగే చర్యలు చేపడుతుంటే… ఇప్పుడు దీనికి కౌంటర్ గా వైకాపా గర్జన అంటూ సభకు సిద్ధమౌతూ ఉండటం విశేషం. ఈ లెక్కన బీసీల సమస్యలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాంశంగా చూస్తున్నది ఎవరు..? ముఖ్యమంత్రి సభ తరువాత ప్రతిపక్షంలో స్పందన వచ్చేసి, బీసీల గురించి మాట్లాడుతున్నారంటే… ఏ తరహా సంకేతాలను ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలి..?