వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు నేడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రెండో ఏడాది తాడేపల్లి బ్యారేజ్ పై ఎవరూ బ్యానర్లు కట్టలేదు. ఆయన ఇంటికెళ్లే దారిలో ఫ్లెక్సీలు కట్టిన వాళ్లు లేరు. ఒక్క ఏడాదిలోనే ఇంత మార్పు ఎలా వచ్చిందా అని అప్పుడు చాలా మంది అనుకున్నారు. ఆ మార్పు బలమేంటో నాలుగేళ్ల తర్వాత జగన్ తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా.. సారీ ఆ హోదా కూడా లేదు..కానీ ఆయన ప్రతిపక్షనేతనే.. ఎందుకంటే ఆయనకు 38 శాతం ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. పదవి చేపట్టిన మొదటి ఏడాది మాత్రమే కలర్ ఫుల్ .. తర్వాత బ్లాక్ అండ్ వైట్. ఎందుకిలా జరుగుతోంది?
బీజేపీ కాళ్లు ఎందుకు అలా పట్టేసుకుని ఉంటున్నారు ?
జగన్ ఎన్నికల్లో సాంకేతికంగా గెలిచారు..కానీ అది ఆయన ఓటమి అని ఐదేళ్ల ఆయన పరిపాలన.. అనంతరం వచ్చిన ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎందుకిలా అంటే.. రాజకీయంలో విలువల్లేకుండా.. కాలానికి తగ్గట్లుగా మారిపోతూ గాలికి తగ్గట్లుగా వెళ్లిపోతే చాలనుకున్నారు. కానీ అది తాత్కాలిక విజయాలను ఇస్తుంది. దీర్ఘకాలంలో పునాదుల్ని బలహీనం చేస్తుంది. జగన్ ఎప్పుడూ దీర్ఘకాలంగా ఆలోచించరు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆయన మారలేదు. జనసేన, టీడీపీతో జత కట్టి తనను..తన పార్టీని పాతాళంలోకి పడేసిన బీజేపీపై ఆయన ఇంకా ప్రశంసలు కురిపిస్తున్నారు. అవసరం లేకపోయినా మద్దతిస్తున్నారు. అంటే ఆయన రాజకీయం ఇంకా నేర్చుకోలేదనే అర్థం.
టీడీపీ, జనసేన కూటమికి మద్దతిచ్చి ఏం సాధించుకుంటారు?
టీడీపీ, జనసేన కూటమిలో ఉన్న బీజేపీకి మద్దతిచ్చి ఏం సాధిస్తారు? మీరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని ప్రపంచానికి చెబుతున్నట్లుగా ఉంది. జమిలీ ఎన్నికలను వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితి ఎందుకు.. అంబేద్కర్ ను అవమానించారని విపక్ష పార్టీలన్నీ ఆందోళనలు చేస్తూంటే పనిగట్టుకుని అమిత్ షాకు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏముంది?. కేసుల భయం అయితే.. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప అనే సూక్తిని ఎలా మర్చిపోతారు. తృణమూల్ ను ఎలా వేధించారు.. రాహుల్ సోనియాను ఎలా వేధించారు… హేమంత్ సోరెన్ జైలుకెళ్లి మళ్లీ సీఎం అవలేదా ?
ఎన్నికలకు ముందే ఉండవల్లి ఇచ్చిన సలహాను గుర్తు చేసుకోరా?
శ్రేయేభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడో సంకేతాలు ఇచ్చారు. పోరాడితే పోయేదేం లేదు.. ఇప్పటికైనా బీజేపీపై యుద్దం ప్రకటిస్తే..మహా అయితే జైలుకెళ్తారు. .. దాని వల్ల వల్ల రాజకీయ ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని. ఇప్పటికే పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి కొత్తేం కాదని కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా చేయలేదు.. అధికారం కోల్పోయారు.. ప్రతిపక్ష నేత హోదా కోల్పోయారు. ఇప్పుడు పార్టీ ఉంటుందో ఉండదో తెలియనంత గందరగోళంలో పడిపోయారు. ఇప్పటికైనా ఆ పెద్దాయన సలహాల్ని పాటించి.. రాజకీయం నేర్చుకోవాలని చాలా మందికోరుకుంటున్నారు. బీజేపీపై యుద్దం ప్రకటించండి.. ఆ పోరాటంలో జైలుకెళ్లినా విజయమే. అధికారం పోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండరని తెలుసు. అందుకే హ్యాపీ బర్త్ డే చెప్పాలని కూడా అనిపించడం లేదు.
ఉండవల్లి అంత కాకపోయినా ఎంతో కొంత మీ శ్రేయోభిలాషి చైతన్య