మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై ఈ మధ్యనే యాత్ర అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలోని ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘నేను విన్నాను, నేనున్నాను’… ఇదే ఆ డైలాగ్. ఇప్పుడు అచ్చంగా అదే సినీ ఫక్కీలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండటం విశేషం! రాయచోటిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్, ఇదే డైలాగ్ చుట్టూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతుల కష్టాలను తాను చూశాననీ, వారి గుండె చప్పుళ్లు విన్నాననీ, నేనున్నానని చెప్పారు. మహిళల కష్టాలు చూశాననీ, వారి బాధలు విన్నానని, నేనున్నానని అన్నారు! వృద్ధుల ఇబ్బందుల్ని కళ్లారా చూశాననీ, వారి ఆవేదన విన్నాననీ… నేనున్నానని చెప్పారు. ఇలా అన్ని వర్గాలనూ వరుసగా ప్రస్థావిస్తూ… చివరిగా ‘నేనున్నాను’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టుకుని మాట్లాడారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ కీలక సమయంలో… ప్రసంగాల్లో ఇలాంటి సినీ ఫక్కీ ధోరణులు అవసరమా అనేదే ఇప్పుడు చర్చ. ప్రచారం హాట్ హాట్ గా జరగాల్సిన సమయం ఇది. జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ఏం చెయ్యలేకపోయారు… వీటి మీద మాత్రమే ప్రజల దృష్టి ఉండేలా వైకాపా ప్రసంగాలు ఉండాలి. కానీ, ఇలా సినీ స్టైల్లో మాట్లాడితే… ఆ ప్రసంగంలోని అంశాలపై కంటే, ఆ ప్రసంగం శైలి మీదే ప్రజల ఫోకస్ ఉంటుంది. వాస్తవానికి, పాదయాత్రలో జగన్ ప్రసంగాలు ధీటుగా సాగేవి. ప్రభుత్వంపై విమర్శలూ ఆరోపణలూ తీవ్రంగా చేసేవారు. కానీ, ఎన్నికల ప్రచారానికి వచ్చేసరికి… ఆ ఘాటు కాస్త తగ్గిందనే చెప్పాలి. పార్టీ మేనిఫెస్టో, నవరత్నాలు వంటి కీలకాంశాలకు ప్రాధాన్యత తగ్గించేశారు.
వైయస్ వివేకానందరెడ్డి హత్య, డాటా చోరీ వ్యవహారం… వీటినే ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు. వివేకా హత్యకు టీడీపీ సూత్రధారి అని ఎంత ఆరోపించినా… అనూహ్య ప్రభావం ఉండదు. ఎందుకంటే, పోలీసుల దర్యాప్తులో నిజాలు వెల్లడి కావాల్సి ఉంది కాబట్టి! అలాగే, డాటా చోరీ అంటూ టీడీపీ విమర్శించినా ఫలితం ఉండదు. ఎందుకంటే, దాని వల్ల నిజ జీవితంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని జగన్ ఇప్పటికీ వివరంగా ప్రజలకు చెప్పలేకపోతున్నారు కాబట్టి! వీటితోపాటు, ప్రచారంలో మరో కీలకాంశం… టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నమ్మొద్దనీ, అన్న ముఖ్యమంత్రి కాగానే ఇంకా ఎక్కువే ఇస్తారని చెప్పడం! దీని వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఇస్తున్న పథకాలను నమ్మొద్దనీ… ఎప్పుడో ఇస్తారనే పథకాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకోమంటే.. ప్రజలకు భరోసా ఎలా కుదురుతుంది..? ఓవరాల్ గా జగన్ ప్రసంగాల్లో ఇంకేదో కావాలనే భావన కలుగుతోంది. గతంలో మాదిరిగా.. ఆయన ప్రసంగాలు సంచలనం కావడం లేదు. ఈ ధోరణిలో మార్పు త్వరలోనే ఉంటుందేమో చూడాలి.