జిల్లాల్లో పరిస్థితులు తెలుసుకోవడానికి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, మంత్రులతో జిల్లాల వారీగా.. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చివరిలో మనసు మార్చుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అక్కర్లేదని సమాచారం పంపారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు.. కృష్ణానది ఒడ్డున.. భవానీ ద్వీపం దగ్గర… ముఖ్యమంత్రి జగన్.. అధికారులు, మంత్రులకు విందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. పదమూడు జిల్లాలకు పదమూడు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రతీ టేబుల్ దగ్గర.. ఆయన జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారని.. వారితో జగన్ మాట్లాడతారని.. సమస్యలను తెలుసుకుంటారని.. అక్కడిక్కడ పరిష్కారం చూపుతారని ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి…సీఎంవో ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఎస్పీలందరూ… విజయవాడ కూడా చేరుకున్నారు. అయితే.. సమావేశానికి ఎస్పీలు, కలెక్టర్లు వద్దని చెప్పడంతో… ఎస్పీలతో .. డీజీపీ దిశ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. అలాగే జిల్లా ఎంపీలను కూడా హాజరుకానవసరం లేదని సీఎంవో సమాచారం పంపింది.
కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయవాడ లో ఉండే సివిల్ సర్వీస్ అధికారులకు మాత్రమే.. జగన్ విందు ఇస్తారని సమాచారం పంపారు. అయితే జగన్ హఠాత్తుగా… ఈ వినూత్న భేటీని ఎందుకు వాయిదా వేసుకున్నారో.. ఉన్నతాధికారులకూ అర్థం కాలేదు. అయితే.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందర్నీ కూర్చోబెట్టి మాట్లాడితే.. రాజకీయ పరమైన విమర్శలు వస్తాయన్న కారణంగానే వెనుకడుగు వేసినట్లుగా భావిస్తున్నారు.