చంద్రబాబు ఇంటిని గౌరవంగా ఖాళీ చేయాలని మంత్రులు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తూంటే.. విజయసాయిరెడ్డి లాంటి నేతలు ట్విట్టర్లో కూల్చివేత తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అసలు ఆ ఇల్లు సక్రమ కట్టడమేనన్న వాదనను.. తెరపైకి తీసుకు వస్తున్నారు.. ఆ ఇంటి యజమాని లింగమనేని రమేష్. ఆ ఇంటికి 2007లో పంచాయతీ అనుమతి తీసుకున్నారు. 2009లో రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ నుంచి కూడా మినహాయింపు పొందారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి కట్టడం అక్రమ కట్టడం కాదని, నదికి 100 మీటర్లు దూరం దాటిని ప్రతి కట్టడం సక్రమమేనని న్యాయనిపుణులు.. టీడీపీ అధినేతకు నివేదిక ఇచ్చారు.
ప్రభుత్వం హడావుడిగా కూల్చేసిన ప్రజావేదిక నది గర్భానికి సుమారు 130 మీటర్ల దూరంలో ఉందని తేల్చారు. అయితే ప్రభుత్వం కచ్చితంగా ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యంతో ఉండటంతో.. కక్షతీర్చుకోవడానికైనా ఇల్లు కూలుస్తారన్న అభిప్రాయంతో నేతలు ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇళ్లను కూడా చూసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో అధినేతకు సరిపడ భారీ భవంతులు ఎనిమిది వరకు సిద్ధంగా ఉన్నాయని నేతలు చెబుతున్నారు. అనవసరంగా ఇక్కడ ఉండటంకంటే వెంటనే ఖాళీ చేస్తే మంచిదని కొంతమంది నేతలు చంద్రబాబుకు సూచించారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాము.. అక్రమ కట్టడమని, దీన్ని కూల్చివేసి సామాన్లు బయటపడేస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మొత్తానికి చంద్రబాబు ఇల్లు మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం హెచ్చరికలు చేస్తూండటం… మరో వైపు టీడీపీ అధినేత కూడా.. ఎంత చేస్తే.. అంత మంచిదన్నట్లు ఉండటంతో… రాజకీయం మరింత ముదిరే అవవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో… ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చేసి… ఆక్రమణలుగా తేల్చేసిన.. మిగతా భవనాలపై సైలెంట్‌గా ఉంటే.. ప్రభుత్వంపై విమర్శలు వస్తాయి. కోర్టుల్లో ఉన్న కేసులు… ఇతర కారణాల వల్ల ప్రైవేటు భవనాలపై ఇప్పుడల్లా అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అందుకే.. టీడీపీ ఈ విషయంలోవ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.