జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ణయం పై స్పందించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలులో జుడిషియల్ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని మీద ఒక నిపుణుల కమిటీ వేస్తామని, కమిటీ వారం రోజుల్లోగా నివేదిక ఇస్తుందని కూడా జగన్ ప్రకటించారు. అయితే మీరు ముందే మూడు రాజధానులు నిర్ణయించేసుకున్నప్పుడు , నిపుణుల కమిటీ వేయడం వారిని అపహాస్యం చేయడమే అంటూ స్పందించారు పవన్ కళ్యాణ్.
పవన్కళ్యాణ్ ట్విట్ చేస్తూ, “తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.అలాగా , ఒక్క అమరావతి రాజధానికి దిక్కు దివానం లేదు ఇప్పటిదాకా. మరి జగన్ రెడ్డి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యే పనేనా. పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి పరిస్థితి అశాంతి అభద్రత తప్ప ఇంకేమి ఒరగ లేదు. కమిటీ రిపోర్ట్ రాక మునుపే ,జగన్రెడ్డి గారు ,మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి?నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి? ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి. హై కోర్ట్ కర్నూల్ లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్ కి వెళ్లాలా ?
అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్ లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా ?” అని రాసుకొచ్చాడు.
మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సిపి నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.