ఎంత మంది కలిసి వచ్చినా గెలుపు మాదే అంటూ ఇప్పటి దాకా తొడకొట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా బేల గొంతుతో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ టీడీపీ, జనసేనకు సవాల్ చేస్తున్నారు. అసలు విపక్షాలు ఎలా పోటీ చేస్తాయన్నది.. వారిష్టం. ఎలా పోటీ చేయాలో వారే తేల్చుకుంటారు. అది వారి రాజకీయం. కానీ సీఎం జగన్ స్టైలే వేరు. ఒకప్పుడు పైసా పెట్టుబడి పెట్టకుండా షేర్లు అమ్మి.. వేల కోట్లు పోగేసి పెట్టిన సాక్షి పత్రికను రూ. రెండు కి ఇచ్చి మిగతా పత్రికలు కూడా రెండుకే ఇవ్వాలని సవాల్ చేసినట్లుగా ఇప్పుడు.. తాము ఒంటరిగా పోటీ చేస్తాం.. మీరు కూడా ఒంటరిగా పోటీ చేయాలన్న వాదన తీసుకు వస్తున్నారు.
విపక్షాలు కలిస్తే ఓడిపోతామన్న భయంలో జగన్ !
సీఎం జగన్ పెట్టింది వైసీపీ సభ కాదు. రాజకీయ సభ అంత కన్నా కాదు. ప్రజా ధనంతో పెట్టిన బహిరంగసభ. దీనిపై ఆయన రాజకీయ సవాళ్లు చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో పోటీ చేయాలి.. 175 స్థానాల్లో పోటీచేసి గెలిచే ధైర్యం ఉందా? అని సవాల్ చేశారు. ఎప్పట్లాగే ఇతర తిట్లు, శాపనార్ధాలు.. తన మీట నొక్కుడు గొప్పదనం గురించి చెప్పుకున్నారు. కానీ.. మీరు ఒంటరిగా పోటీ చేయాలంటే. విపక్షాలను బేలగా సవాల్ చేయడం.. మాత్రం హైలెట్ అవుతోంది.
జనసేనను దెబ్బ తీసేందుకు .. కాపు ఓట్లని చీల్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయా ?
టీడీపీ, జనసేన కలిస్తే దారుణమైన పరాజయం ఎదురొస్తుందన్న అభిప్రాయాలు రోజు రోజుకు బలంగా వినిపిస్తున్నాయి. సర్వే రిపోర్టుల్లోనూ అదే్ వెల్లడవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి.. ఎలాగైనా జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేసేలా చూడాలనుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్ర ఆత్మీయ రాజకీయ నేతతో కలిసి ఆయన చేస్తున్న రాజకీయం.. పవన్ ను ఒంటరిగా పోటీ చేయించేందుకు వేస్తున్న ఎత్తుగడలు.. అలాగే పవన్ ఓటు బ్యాంకును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ సఫలం కావడం లేదన్న బాధ జగన్‌లో కనిపిస్తోందన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు, జగన్ కలిసేలా చేసింది జగనే .. ఇప్పుడు తప్పు తెలిసిందా?
వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ను బండ బూతులు తిట్టి.. ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేసి.. ఇక రెండు పార్టీలూ కలవకపోతే.., రాష్ట్రం బాగుపడదనే పరిస్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడు వాళ్లు కలిసే పరిస్థితి రావడంతో… ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి సవాళ్లు… ఏ మాత్రం రాజకీయాలకు సూటవవ్వని.. ఆయన నేరుగా పొత్తులు పెట్టుకోకపోవచ్చు కానీ.. తెరవెనుక రాజకీయాల గురంచి అందరికీ తెలుసని.. ఇతర పార్టీలు నేరుగా పొత్తులు పెట్టుకుంటే.. ఓటమి ఖాయమన్న భయంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.