ఒక ఐదేళ్ళ క్రితం జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఓదార్పు యాత్ర చేసాడు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలని ఓదార్చడానికి ఆ యాత్ర చేసినపుడు ప్రధానంగా ఒక విమర్శ వచ్చింది ప్రత్యర్థుల నుంచి. ఇది ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు లేదు, ఏదో మందీ మార్బలం తో పెద్ద కాన్వాయ్ తో, జై జగనన్న నినాదాలతో ఒక పెళ్ళికి వెళ్తున్నట్టుగా ఉంది అని. జాతీయ మీడియాలో సైతం, దీనిమీద చర్చ జరిగింది. ఓదార్పు అనేది ఆ వ్యక్తి మరణించిన కొద్దిరోజుల పాటు మాత్రమే ఉంటుంది కానీ ఇలా నెలల తరబడి సా..గ తీస్తూ… చేస్తారా అని. అదీ కాక ఇంత ఆర్భాటంగా ఓదారుస్తారా అని మీడియా లో చర్చ జరిగింది. నిజానికి అప్పట్లో జగన్ ఏది మొదలెట్టినా, ఆర్భాటంగానే చేసేవాడు. అయితే ఇప్పుడు జగన్ ని చూస్తూంటే, చాలా మార్పు కనిపిస్తోంది.
రెండ్రోజుల్లో మొదలు కానున్న పాదయాత్ర కి ముందు తిరుపతికి వెళ్ళడం, ముందుగా వెళ్ళి స్వామిజీ ల ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. పైగా ముందుగా అనుకున్న “అన్న వస్తున్నాడు” క్యాప్షన్ మరీ సెల్ఫ్ సెంట్రిక్ గా ఉందని గుర్తించాడో ఏమో, దాన్ని ప్రజా సంకల్ప యాత్ర గా మార్చాడు. సాక్షి ఉంటే చాలు అనుకునే వాడు కాస్తా, అన్ని మీడియా ఛానెళ్ళ తో చర్చలు జరుపుతున్నాడు. మీ పొలిటికల్ అఫీలియేషన్స్ విషయం లో మొహమాట పెట్టను, కేవలం యాత్రకి కవరేజ్ మాత్రం చక్కగా ఇవ్వండి చాలు అని అభ్యర్థిస్తున్నాడు.
ఇవన్నీ జగన్ లో వచ్చిన పాజిటివ్ మార్పు కి సంకేతాలే. కాకపోతే ఇవి సరిపోవు. ప్రజల కి నమ్మకం కలిగించగలగాలి తాను ప్రజా సమస్యల పై చిత్త శుద్ది కలిగి ఉన్నాడని. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ యాత్ర ప్రజల కోసమనీ, తన ముఖ్యమంత్రి పదవి కోసం కాదనీ ప్రజలు అనుకునేలా చేయాలి. మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ జరుగుతాయా లేదా అనే ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది.