వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సినీ ఫక్కీలో ప్రచార ప్రసంగాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే! యాత్ర సినిమా ద్వారా పాపులర్ అయిన డైలాగ్… ‘నేను విన్నాను, నేను ఉన్నాను’. దాన్నే తన ప్రసంగాల్లోకి ట్యాగ్ లైన్ గా పెట్టుకుని, ప్రతీ అంశానికి చివరన అదే జోడించి మాట్లాడుతున్నారు. ఇవాళ్ల చింతలపూడిలో జరిగిన ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. తాను చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన కష్టాలను విన్నాననీ, బాధల్ని చూశాననీ, రాష్ట్రంలో ప్రతీ కుటుంబం ఏమనుకుంటోందో విన్నాను అన్నారు. అవన్నీ విన్న తరువాత, చూసిన తరువాత చెబుతున్నాను… నేను ఉన్నాను అని జగన్ అన్నారు.
ప్రభుత్వం చేస్తామన్న రుణమాఫీ జరగక, పంటలు పండక రైతన్నలు పడ్డ ఇబ్బందుల్ని చూశానన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ రాక, చదువులు కొనసాగించలేక… బిడ్డల చదువుల్ని కొనసాగించాలంటే అప్పులు పాలౌతారన్న తల్లిదండ్రులను చూశానన్నారు. చదువు కొనసాగించలేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆ తల్లిదండ్రుల కష్టాలు నేను చూశానన్నారు, ఆ బాధలు నేను విన్నా అన్నారు. 108కి ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ రావాల్సిన అంబులెన్స్ రాక, వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారి బాధలు నేను చూశా అన్నారు. 108 రాక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులు చెప్పిన కష్టాలను విన్నా అన్నారు. మద్యానికి బానిసలై, కుటుంబాలు ఛిన్నాభిన్నమైన పరిస్థితుల్ని నేను చూశా అన్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు తగలేసిన పిల్లల ఆవేదనల్ని నేను విన్నాను అన్నారు. ఇలా… చాలా సమస్యలు ప్రస్థావిస్తూ విన్నాను, చూశాను, చివరికి ‘నేను ఉన్నాను’ అంటూ జగన్ ప్రసంగం కొనసాగించారు.
ప్రశ్న ఏంటంటే…. ఇన్ని సమస్యలు కళ్ల ముందు తనకి కనిపిస్తే జగన్ విన్నారు, ఉన్నాను అని మాత్రమే చెప్పగలుగుతున్నారు. ‘ఈ సమస్యలపై పోరాటం చేశాను’ అని జగన్ చెప్పడం లేదు! ప్రతిపక్ష నాయకుడిగా సమస్యలు వింటే, ఉంటే సరిపోతుందా… పోరాటం చెయ్యాలి కదా? అంటే… విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంటే… వింటూ కూర్చున్నారన్నమాట! 108 రాక ప్రాణాలు కోల్పోతున్నవారుంటే… చూస్తూ వెళ్లిపోయారన్నమాట! మద్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతుంటే… వింటూనే ఉన్నారన్నమాట! సమస్యలు కంటి ముందున్నప్పుడు, నష్టపోతున్న ప్రజలు అడుగడుగునా కనిపిస్తున్నప్పుడు… వారి తరఫున పోరాటం చేయడం మానేసి.. విన్నాను, చూశాను, వస్తాను, ఇస్తాను అంటూ ఇన్నాళ్లూ దాటేసుకుని వచ్చారా..? ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి… నేనున్నాను అని భరోసా ఇచ్చేస్తే సరిపోతుందా..? ప్రతిపక్ష నాయకుడు ఉన్నది… వినడానికి కాదు, ఉన్నానని చెప్పడానికీ కాదు, ప్రజల తరఫున పోరాటం చెయ్యడానికి! ఫలానా ప్రజా సమస్యపై నేను పోరాటం చేశానని జగన్ చెప్పడం ఎవరైనా విన్నారా..? ఇన్నాళ్లూ విని ఊరుకున్నారే తప్ప… చేసిన పోరాటం గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్న ప్రజల్లో ఉందని గుర్తిస్తున్నట్టు లేదు.