వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. కాపు రిజర్వేషన్ల అంశంపై చాలా ఆలస్యంగా స్పందించారు. ఇంత వరకూ ఆయన అటు అనుకూలంగా కానీ.. ఇటు వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. పార్టీలో ఉన్న కాపు నేతలు మాత్రం.. తమ పార్టీ రిజర్వేషన్లకు అనుకూలమేనని ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ జగన్ మాత్రం నోరు మెదపలేదు. అనుకూలంగా ప్రకటన చేయాలని అనేక సందర్భాల్లో కాపు నేతలు జగన్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో.. కొంత మంది యువకులు ప్లకార్డులు చూపించడంతో… చివరికి సైలెన్స్ బ్రేక్ చేశారు. అది కేంద్ర పరిధిలోని అంశమన్నట్లు తేల్చారు. తాను ఏమీ చేయలేనని చేతులెత్తేశారు.
చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్లు కీలక అంశం. ముద్రగడ చేసిన ఉద్యమం ప్రారంభంలోనే .. పెద్దగా ఏమీ వేడి లేకుండానే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగుల బెట్టడం, పోలీస్ స్టేషన్‌పైనే దాడి చేయడంతో .. సీరియస్ ఇష్యూ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా బీసీ కమిషన్ వేశారు. చైర్మన్ నివేదిక వ్యతిరేకంగా ఇవ్వబోతున్నారని తెలిసి… వ్యూహాత్మకంగా మెజార్టీ సభ్యులతో నివేదిక తెప్పించుకుని… అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రానికి పంపారు. ఇప్పుడు అది కేంద్రం చేతుల్లో ఉంది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను పెడితే.. సుప్రీంకోర్టు కూడా… కొట్టి వేయడానికి అవకాశం ఉండదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియనిదేమీ కాదు.
గతంలో ఈ రిజర్వేషన్ రాజకీయాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి… ముస్లింలను ఓటు బ్యాంక్‌గా మార్చుకున్నారు. ఇప్పుడా ముస్లింలు జగన్‌కు మద్దతుగా ఉండటానికి కారణం… ఆయన తండ్రి ఇచ్చిన రిజర్వేషన్లే. ఇక 2004లో కాపులను బీసీల్లో చేరుస్తామని… మ్యానిఫెస్టోలో పెట్టి.. అధికారం పొందారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. అప్పట్లో ఏ నాయకుడు ఉద్యమాలు కూడా చేయలేదు. ఇవన్నీ కూడా జగన్‌కు తెలియక కాదు. కానీ ఈ విషయంలో జగన్ ఓవర్స్మార్ట్గా ఆలోచించాలన్న విశ్లేషణలున్నాయి. కాపు రిజర్వేషన్లను ఇప్పిస్తానని.. కేంద్రాన్ని ఒప్పిస్తానని.. జగన్ చెబితే.. రెండు రకాల సమస్యలు వస్తాయి. కాపు రిజర్వేషన్లు వస్తే .. ఆ క్రెడిట్ చంద్రబాబుకి వెళ్తుంది. ఎందుకంటే.. ఆయనే హామీ ఇచ్చారు. బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. ఇక రెండో ఇబ్బంది ఏమిటంటే.. కేంద్రం వద్ద రిజర్వేషన్లు ఇప్పించేంత పలుకుబడి ఉంటే.. ప్రత్యేకహోదా విషయంలో ఎందుకు లాబీయింగ్ చేయవు అనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
అందుకే జగన్… ఈ బాధలన్నీ ఎందుకు అనుకుని ఉంటారు. అదే కాకుండా.. పవన్ కల్యాణ్ బరిలో ఉంటే కాపు సామాజికవర్గం ఓట్లు తనకు పడవని డిసైడైపోయి ఉంటారు. లేని..రాని ఓట్ల కోసం.. లేని పోని తలనొప్పులెందుకని భావించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏదైనా కానీ… తనకు చేత కాదు అని చెప్పుకోవడం ద్వారా… ప్రత్యర్థులకు మరో అవకాశాన్ని చేజేతులా జగనే ఇచ్చారు.