పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ప్రస్తుతం త్రిశంకుస్వర్గంలో ఉంది. ముందుకు పోతుందో లేదో తెలియదు. దానికి కారణం.. కొత్త ప్రభుత్వం రాగానే… గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్లందర్నీ తొలగించింది. అనేకానేక విచారణలు వేసింది. కానీ.. ఇప్పటి వరకూ ఏమీ తేల్చలేదు. తేల్చలేదని అనుకుంటున్నారు కానీ.. అన్నీ తేల్చేసి.. కేంద్రానికి.. నివేదిక కూడా ఇచ్చింది. ఈ నివేదికలో.. పోలవరంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలదేని.. రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసింది. 2019 నవంబర్ 13న పోలవరంపై జగన్ ప్రభుత్వం పూర్తి నివేదిక ఇచ్చిందని.. కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు, కోడ్ ఉల్లంఘన ఎక్కడా జరగలేదని.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికే నివేదించింది.
పోలవరంపై ప్రధాని కార్యాలయానికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి స్థాయి నివేదిక సమర్పించింది. ఇందులో.. గత ప్రభుత్వ హయాంలో పోలవరం కాంట్రాక్టు నిబంధనల్లో.. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తేల్చి చెప్పింది. టీడీసీ హయాంలో నిర్ణయాలన్నీ సంబంధిత సంస్థల అనుమతితోనే జరిగాయని.. పనుల జాప్యం కారణంగానే 2017-18లో పాత కాంట్రాక్టర్‌ను మార్చి.. మరొకరికి నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించారని తెలిపింది. 60సి నిబంధన ప్రకారమే కాంట్రాక్టు సంస్థ మార్చారని.. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని తెలిపింది. 2013 భూసేకరణ చట్టం, పనుల పరిమాణం పెరగడంతో పాటు.. అనేక ఇతర అంశాలు ధరలు పెరగడానికి కారణమని పీఎంవోకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. సంబంధిత అథారిటీ అనుమతుల తర్వాతే నిర్ణయాలు తీసుకున్నట్లు.. ఈ విషయాలన్నీ ప్రస్తుత ప్రభుత్వమే చెప్పిందని.. జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
ఈ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా.. ఏపీ సర్కార్.. ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరుపుతోంది. ఈ విషయాలను.. కూడా ప్రధానమంత్రి జలశక్తి శాఖ తెలిపింది. లావాదేవీ ఛార్జీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇద్దరు అధికారులపై ఏసీబీ విచారణ చేపట్టిందని.. ఇదే వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిందని.. కానీ ఇంకా ఏమీ తేల్చలేదని చెప్పింది. పోలవరంపై అనేకానేక అవినీతి ఆరోపణలు చేసి.. వాటి కారణంగానే కాంట్రాక్టర్‌ను కూడా మార్చేసిన కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్వయంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కాంట్రాక్టర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందని.. కేంద్రం కానీ.. పోలవరం ప్రాజెక్ట్ ఆధారిటీ కాని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.