స్టాలిన్‌తో ఇడ్లీ సాంబర్ తింటారు..!
కుమారస్వామితో కాఫీ తాగుతారు..!
మమతా బెనర్జీతో మధ్యాహ్నం చికెన్ తింటారు..!.. అంటూ.. చంద్రబాబు జాతీయ రాజకీయాలపై… జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేస్తున్నారు. బెంగాలి బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన మమతా బెనర్జీ చికెన్ తింటారని… జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్ణయానికి వచ్చారన్నది తర్వాత విషయం కానీ.. చంద్రబాబు జాతీయ రాజకీయాలు చేస్తే.. ఎందుకు అంతగా బాధపడుతున్నానేది మాత్రం ఇక్కడ వాలిడ్ పాయింట్. చంద్రబాబు జాతీయ రాజకీయాలు చేస్తే తప్పా..? ఇతర పార్టీల నేతలను కలవడం తప్పా..? జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు. చంద్రబాబు ఏదో తప్పు చేస్తున్నట్లు ఎందుకు చెబుతున్నారు… ?
జగన్‌కు జాతీయ మీడియానే సపోర్ట్..! కానీ పార్టీలు..?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ అనబడే స్ట్రాటజిస్ట్కి దగ్గరగా ఉండే కొన్ని హిందీ చానళ్లు అవసరం ఉన్నా లేకపోయినా.. సర్వేల పేరుతో.. కొన్ని ఫిగర్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందులో.. వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ ఉంటుంది. వాటిని చూసి ప్రజలు.. నవ్వుకుంటూ ఉంటారు. వాటిని…జాతీయ పార్టీలు కూడా నమ్మడం లేదు. అలా నమ్మితే.. జగన్‌ను తమ కూటమిలో చేర్చుకోవడానికి.. పరుగులు పెట్టుకుంటూ వచ్చేవి. అంతే కానీ.. ఆయా సర్వేల ప్రకారం.. చంద్రబాబుకు వస్తాయని భావిస్తున్న నాలుగైదు సీట్ల కోసం.. ఆయనతో కలిసి నడిచేందుకు ప్రాధాన్యం ఇవ్వరు. ఇన్ని సర్వేల్లో తనకు సీట్లొస్తాయని చెబుతున్నా.. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కానీ.. కనీసం సంప్రదించడానికి కానీ.. చివరికి.. ఢిల్లీలో ఆయన పార్టీకి చెందిన ఎంపీలకో..మాజీ ఎంపీలకో అపాయింట్మెంట్లు ఇవ్వడాన్ని కూడా… వారు లైట్ తీసుకుంటున్నారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుపై కోపం వచ్చినట్లుగా ఉంది.
సీట్లొచ్చే పని అయితే కేసీఆర్ అయినా ఆహ్వానించి ఉండేవారు కదా.. ..?
వాస్తవానికి జగన్ ప్రభంజనం ఉందని నమ్మితే… ఇతర కూటములు.. జగన్ ను దగ్గర చేసుకోవడానికి కావాల్సినంత ప్రయత్నం చేస్తాయి. కానీ.. జగన్ ను సంప్రదించడానికి ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. చివరికి.. కేసీఆర్ కూడా.. జగన్ ను ఇంకా సంప్రదించలేదు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకుంటున్న కేసీఆర్.. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. ఆయన అయినా కనీసం .. జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి ఉండేవారు. కానీ.. కేసీఆర్ ఇంకా ఆ ప్రయత్నం చేయలేదు. అన్ని రాష్ట్రాలు తిరిగినా .. జగన్ వద్దకు మాత్రం రాలేదు. అంటే.. కేసీఆర్‌కు కూడా… జగన్ తీరుపై నమ్మకం లేదు. ఆయన పార్టీకి సీట్లొస్తాయనే నమ్మకం లేదనే కదా అర్థం…!
రాజకీయంటే వ్యక్తిగతం కాదు..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటే వ్యక్తిగతం అనుకుంటున్నారు. అంతా తానే అన్నట్లుగా ఉంటారు. అందుకే ఆయనకు.. సొంత పార్టీలో సహచరులే ఉంటారు తప్ప మిత్రులు ఉండరు. ఇక బయట ఎలా ఉంటారు. రాజకీయాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లి శత్రువుల్ని చేసుకోవడమే ఆయనకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం ఆయన పార్టీకి సరిపడుతుంది కానీ.. రాజకీయాలకు సరిపడదు. దేశంలో రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు.. మద్దతు పెంచుకోవడం అత్యవసరం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే.. ఢిల్లీలో కొన్ని పార్టీల మద్దతు ఉండాలి. ఆ పార్టీలతో నాకేంటి.. అనుకుంటే జరగదు. జరగబోయే పరిణామాల్ని అంచనా వేసుకుని రాజకీయాలు చేయాలి అప్పుడే రాణిస్తారు. అలాంటి రాజకీయ అడుగుల్ని కూడా.. ఏదో తప్పన్నట్లు చెప్పడం.. రాజకీయ అపరిపక్వతే. బహుశా.. జగన్ అనుకునే జాతీయ రాజకీయాలు.. టీఆర్ఎస్తో కలవడమే కావొచ్చు. అంతకు మించి ఎక్కువ ఆలోచించలేనంత …రాజకీయ స్థాయి జగన్‌ది.