అమరావతిని నిర్మిస్తే అదనపు ఆదాయం కాదు కదా.. ఆ నగరం కోసం చేసే అప్పులకు వడ్డీ కూడా కట్టలేమని ముఖ్యమంత్రి జగన్ తేల్చేశారు. అసలు రైతులు ఇచ్చిన 33వేల ఎకరాలు భారీ భవనాల నిర్మాణానికి పనికి రావని తేల్చేశారు. చంద్రబాబు ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం ప్లాన్ చేస్తే సరిపోయేదన్నారు. హిందూస్థాన్ టైమ్స్ కు జగన్ ఇచ్చిన ఇంటర్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో రాజధానిపై కీలక వ్యాక్యలు చేశారు. ప్రధాన నగరాలు ఆదాయాలు తెచ్చి పెడతాయనుకోవడం భ్రమేనన్నారు.అమెరికాలోని ఒమహా అనే నగరంలో 23 ఫార్ట్యూన్ 500 కంపెనీలున్నాయని.. కానీ అక్కడ జనాభా 4 లక్షలు మాత్రమేనని గుర్తు చేశారు.
దేశంలోని ప్రధాన నగరాలన్నీ అభివృద్ధి చెందే సరికి.. దశాబ్దాలు.. శతబ్దాలు పట్టిందని .. అమరావతి వేగంగా అభివృద్ధి చెందలేదన్నారు. కరోనా రాక ముందే అమరావతి రాజధానిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్.. ఇప్పుడు… కరోనా కారణంగా అమరావతి కట్టలేకపోతున్నామన్న కారణం కూడా చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా నగరాలన్నీ దెబ్బతిన్నాయని .. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అమరావతి నిర్మించడానికి నిధులు లభిస్తాయా అని ప్రశ్నించారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అమరావతి పెట్టే పెట్టుబడులు లాభదాయకం కాదని చెప్పిందన్నారు. మూడు రాజధానులను.. శివరామకృష్ణన్ చెప్పినదాని ప్రకారమే పెడుతున్నామని జగన్ చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణన్ చెప్పారన్నారు. అన్ని కార్యకలాపాలు ఒకే చోట నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
జీఎస్టీ పరిహారం విషయంపై కేంద్రంపై ఎందుకు పోరాడలేకపోతున్నారంటే… కేద్రంపై సానుభూతి చూపించారు జగన్. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని అప్పులు తీసుకోవడం మినహా మరో మార్గం లేదన్నారు. కేంద్రం కూడా అప్పులు తీసుకోమని సలహా ఇచ్చిందన్నారు. కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన అడగడం లేదనే వాదనను జగన్ తేలిగ్గా తీసుకున్నారు. అన్నీ అడుగుతూనే ఉన్నామన్నారు. ప్రత్యేకహోదా డిమాండ్‌ను వదిలి పెట్టలేదన్నారు.