కేంద్రం ఇవ్వకపోయినా మేమిస్తున్నాం..! పోలవరానికి కేంద్రం నిధులివ్వట్లేదు..! కేంద్రం సహకరించడం లేదు..! ఏపీకి అన్యాయం చేస్తున్నారు..!… ఈ డైలాలుగు ఇటీవలి కాలంలో వైసీపీ నేతల నుంచి పెరిగిపోయాయి. భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడానికి ది బెస్ట్ అన్న పద్దతితో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో తన వైఫల్యాలన్నింటికీ… కేంద్రాన్ని కారణంగా చూపించడం ప్రారంభించడం ప్రారంభించారు. తాజాగా వైఎస్ఆర్ బీమా పథకంలో ఎన్రోలో అయినప్పటికీ.. బీమా క్లెయిమ్ రాని వారికి .. డబ్బులు ఖాతాల్లోకి జమ చేసే మీట నొక్కి కేంద్రంపై ఆరోపణలు చేశారు. కేంద్రం అనేక ఆంక్షలు పెట్టి… పథకాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పుకొచ్చారు. నిజానికి కేంద్రం పెట్టిన నిబంధనలు అమలు చేయలేనివేమీ కావు. కానీ.. 0ఎం జగన్ కేంద్రంపై నిందలేస్తున్నారు.
వరుసగా కేంద్రాన్ని తప్పు పడుతున్న వైసీపీ నేతలు..!
ముఖ్యమంత్రి జగన్ రాజకీయం ఇటీవలి కాలంలో కాస్త మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి సందర్భంలోనూ గతంలో బీజేపీని పల్లెత్తు మాట అనడానికి ఆయన పార్టీ నేతలకు పర్మిషన్లు ఇవ్వలేదు. ప్రెస్మీట్లలో ఏం మాట్లాడాలన్నా.. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సూచనల మేరకే మాట్లాడాలన్న స్పష్టమైన కట్టుబాటు వైసీపీలో ఉంది. ఆ ప్రకారం బీజేపీపై ఎవరూ నోరు మెదపరు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం… బీజేపీ నేతలపై రాజకీయంగా విరుచుకుపడ్డారు. అయితే విధాన పరంగా ఎప్పుడూ ప్రశ్నించలేదు. రాజకీయం కోసం ఏపీలో కొన్ని ప్రకటనలు చేసినా ఢిల్లీలో మాత్రం కనీసం ప్రకటనలు కూడా చేయరు. కానీ ఇప్పుడు విధాన పరంగా విమర్శలు చేస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ కూడా ఇందులో భాగమవడమే ఇప్పుడు తెలుగు రాజకీయాల్ని ఆసక్తికరంగా మారుస్తోంది.
తాము సహకరిస్తున్నా…తమకు మేలుచేయడం లేదని జగన్ భావన..?
సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం అనుసరిస్తున్న తీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వైసీపీలోని అంతర్గత రాజకీయం నిరవహించే వ్యక్తులు అడపాదడపా… ఇంటర్నల్ మీటింగ్స్‌లో బయట పెడుతున్నారు. కేంద్రానికి ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా ఇవ్వనంతగా సహకారాన్ని అందిస్తున్నా.. తమకు మాత్రం.. కోరుకున్నంతగా.. ఆశించినంతగా కేంద్రం సహకరించడం లేదనేది వారి అభిప్రాయం.అయితే ఈ సహకారం… కేంద్రం ఇవ్వాల్సిన నిధులు.. ప్రాజెక్టులు కాదు. ఇతర అంశాల్లో. ఇటీవల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ నియామకం విషయంలోనూ.. కేంద్రం తీరుపై జగన్ అసహనానికి గురయ్యారని వైసీపీ వర్గాలు కొన్ని మీడియాకు లీక్ చేశాయి.
మమతతో కలిసి బీజేపీపై పోరాటానికి గ్రౌండ్ వర్కా..?
కేంద్రంపై పోరాడటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మమతా బెనర్జీ ఆహ్వానం పలికారు. అదే సమయంలో… సీఎం కేసీఆర్ తో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్రంపై కలసి కట్టుగా పోరాడటానికి ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో కేసీఆర్ నివాసం అయిన ప్రగతి భవన్లో సమావేశం అయి చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జగన్ అప్పట్లో కంగారు పడిపోయిఖండించారు. కానీ ఆ చర్చలు నిజమేనని సందర్భాన్ని బట్టి .. బీజేపీపై పోరాడాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. దాని కోసం ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారని.. త్వరలోనే మరింత దూకుడుగా కేంద్రంపై విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు.