తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సెంటర్ పాయింట్ అయిపోయారు. కేసీఆర్… చంద్రబాబు జపమే చేస్తున్నారు. చంద్రబాబు… తెలంగాణ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా ప్రజల్లో ఓ నమ్మకం కలిగించి.. ఆయనను తరిమికొట్టాలని వీరావేశంగా పిలుపునిస్తున్నారు. తెలంగాణలో అన్నింటికీ చంద్రబాబే కారణం అంటున్నారు. మరి తెలంగాణలోనే చంద్రబాబు అన్నింటికీ కారణం అయితే.. ఏపీలో మాత్రం కాకుండా ఉంటారా..?. కచ్చితంగా అవుతారు. అదే విషయంలో.. ఏపీలోని ప్రతిపక్ష నేతలు ఇద్దరూ.. ప్రతీ రోజూ.. గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రతీదానికి చంద్రబాబే చేయించారని… తెగ ఇదైపోతున్నారు. ఇది ఎంత వరకూ వచ్చిందంటే.. తమ పాదయాత్రల్లోకి బర్రెలు, గొర్రెలు వచ్చినా.. అవి టీడీపీనే.. చంద్రబాబే పంపారు.. అని.. మరో ఆలోచన లేకుండా ఆరోపించేంతగా..!
కొన్నాళ్ల క్రితం.. పవన్ కల్యాణ్ పలాసలో పోరాటయాత్ర చేశారు. ఆ సమయంలో కొన్ని గోవులు.. పోరాటయాత్రకు రివర్స్‌లో వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నేతలు… ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబే కుట్రతో.. ఆ గోవుల్ని పోరాటయాత్ర భగ్నానికి పంపారని పవన్ కల్యాణ్ ఆవేశ పడ్డారు. నిజానికి ఆ గోవులు రెగ్యులర్‌గా.. రోజూ అదే టైంలో తమ మేత డ్యూటీ ముంగించుకుని.. ఇళ్లకు వెళ్తూంటాయి. వాటి దారికి అడ్డం పోయింది పోరాటయాత్రనే. కుట్ర.. గిట్ర ఉంటే.. అవే అనుకోవాలి… తమ మీద కుట్ర చేశారని. కానీ వాటికి నోరు లేదు.. రాజకీయం తెలియదు కాబట్టి.. తోలినా.. ఎలాగోలా దారి చూసుకుని ఇంటికెళ్లిపోయాయి. కానీ ఆ నింద మాత్రం చంద్రబాబు మీద పడిపోయింది. అదే తరహాలో.. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డి కూడా..చంద్రబాబును అనేశారు. ఆయన విజయనగరం శివార్లలో పాదయాత్ర చేసి.. ప్రసంగిస్తున్న సమయంలో.. ఓ గోవు వచ్చింది. అసలే ఇరుకు రోడ్డులో… ఆయన వాహనం నిలిపితే అటూ ఇటూ పోవడానికి వీలు ఉండదు. ఆ గోవుకు ఎటు పోవాలో తెలియక… అక్కడ ఇరుక్కుపోయింది. దాన్ని చంద్రబాబే పంపారని… నిర్మోహమాటంగా.. ఆరోపించేశారు జగన్. ఇది ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ అయిపోయింది.
ఏం జరిగినా…చంద్రబాబే కారణం ఆరోపించడంలో వీరిద్దరికి… ఏకాభిప్రాయం ఉంది. ఇద్దరు ప్రతిపక్ష నేతలు.. చంద్రబాబు ఫోబియాతో అల్లాడిపోతున్నారనే అభిప్రాయం.. మెల్లగా ప్రజల అభిప్రాయాల్లో బలపడిపోతోంది. ఇద్దరూ.. గట్టిగా గాలి వాన వచ్చినా… అది చంద్రబాబు పనేనని అంటున్నారు. తమకు తమ్ములు.. దగ్గులు వచ్చినా చంద్రబాబు అనేలా ఉన్నారు. మొత్తానికి ప్రతిపక్ష నేతలిద్దరూ.. చంద్రబాబుపై బురద జల్లడాన్ని గాల్లో రాళ్లు వేయడంగా భావిస్తున్నారు. నిర్మాణాత్మక రాజకీయం జోలికే పోవడం లేదు.