భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి చేసే ప్రయత్నాల కన్నా.. వచ్చిన తర్వాత.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు చెప్పడమే మంచిదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి… ఏం చేయాలన్నదానిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వైరస్ సోకిన తర్వతా మందులు తీసుకుంటే తగ్గిపోతుందన్నారు. 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ నయం చేసుకుంటున్నారని.. 15 శాతమే ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కొవిడ్‌తో కలిసి జీవించాల్సిందేనని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. దాంతో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కడికక్కడ కోవిడ్ ఆస్పత్రులు… క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. రోగుల సంఖ్య పెరిగిపోతూండటంతో.. వైద్యం అందించడం కూడా కష్టతరంగా మారుతోంది. ఏపీలో ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలే ఉంటాయి. ప్రత్యేకంగా కుటుంబసభ్యులకు గదులు ఉండటం చాలా తక్కువ. దీంతో హోం ఐసోలేషన్ కూడా సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రభుత్వం.. కరోనా కట్టడి కన్నా.. సోకిన వారికి వైద్యం అందించడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ముఖ్యమంత్రి అభిప్రాయం కూడా అంతే ఉంది.
మరో వైపు.. రోజుకు 40కి పైగా.. మరణాలు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య రెండున్నర వేలు దాటిపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 22వేలకుపైగా శాంపిల్స్ పరీక్షించంగా 2593 మందికి పాజిటివ్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అంటే.. దాదాపుగా ప్రతి వంద మందిలో పదకొండు మందికి కరోనా వైరస్ సోకిందని అర్థం. అదే సమయంలో.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నాలుగు రోజుల కిందట వరకూ.. రోజుకు పదిలోపే ఉండే మరణాలు ఇప్పుడు.. సగటున నలభై పైనే నమోదవుతున్నాయి. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ.. రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజు… ఈస్ట్ గోదావరి జిల్లాలో 500 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.