ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలుగు భాషలో చదవుకోవడాన్ని అంటరానితనంగా చెప్పడం కలకలం రేపుతోంది. ” విద్యాపరంగా అంటరానితనాన్ని పాటించాల్సిందనే వాదనలు.. మరో రూపంలో ఇప్పుడు వినిపిస్తున్నాయని.. మా పిల్లల్ని, మనుమల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం… పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదనే వాదన చేస్తున్నారని.. ఇలా వాదించడం ద్వారా వారు.. రూపం మార్చుకున్న అంటరానితనాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు.. దీనిని మేము సమర్దించలేం” అని జగన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
ఆయనకు క్రియేటివ్‌గా ఉందని ఎవరైనా రాసిచ్చారో.. లేక స్వయంగా రాసుకుని వచ్చి చదివారో కానీ ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చిన ఆ మాటలు విని భాషా ప్రేమికులు ఉలిక్కి పడ్డారు. తెలుగు మీడియంను రద్దు చేస్తూ.. ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు కాదని..ఏ మీడియంలో చదవుకోవాలనేది విద్యార్థులు, తల్లిదండ్రుల ఇష్టమని కోర్టు ఆ జీవోలను కొట్టి వేసింది. కేంద్రం కూడా.. కొత్త విద్యా విధానాన్ని ప్రకటించి ఐదో తరగతి వరకు మాతృభాషను తప్పనిసరి చేసింది.
అయితే.. కోర్టుల తీర్పులను పట్టించుకోని ఏపీ ముఖ్యమంత్రి… కేంద్ర విద్యా విధానాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. పైగా ఎదురుదాడికి సిద్దమయ్యారు.
ఏపీలో ఇంగ్లిష్ మీడియం పెట్టవద్దని ఎవరూ చెప్పడం లేదు. తెలుగు మీడియం కూడా ఉంచితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు వారికి ఇష్టమైన మాధ్యమంలో చదవుకుంటారని అంటున్నారు. కానీ పూర్తిగా రాజకీయ కోణంలో… ప్రజల్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో.. ఇంగ్లిష్ మీడియాన్ని వద్దంటున్నారంటూ… రాజకీయ పార్టీలు, కోర్టులు.. చివరికి కేంద్రంపైనా.. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు మఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలుగు భాషను నేర్చుకోవడం… తెలుగు మీడియంలో చదువుకోవడం అంటరానితనమన్నట్లుగా జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పు పట్టారు. అమరావతి శిలాఫలకంలో తెలుగులో పేర్లు లేవని అరచి గోల పెట్టిన వారు ఇప్పుడెక్కడున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.