ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర దాదాపు చివరి దశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో చివరి మజిలీకి యాత్ర చేరుకుంటుంది. అయితే, ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం చేరుకునేలోపు జగన్ ని ఎంతోమంది ప్రజలు పలకరిస్తున్నారు. సాక్షి పరిభాషలో చెప్పాలంటే… జగన్ కి కష్టాలను చెప్పుకుంటున్నారు, సమస్యల్ని వివరిస్తున్నారు, టీడీపీ పాలనలో అన్యాయమైపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఎచ్చర్ల నియోజక వర్గంలో కూడా అక్కడి ప్రజలు జగన్ తో… పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలే దిక్కు అవుతున్నాయని వాపోయారు, పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులే మిగులుతున్నాయని కొందరు వృద్ధులు మొరపెట్టుకున్నారు, ఉద్యోగాలు లేవంటూ యువత.. ఇలా చాలా సమస్యలు చెప్తున్నారని వైకాపా మీడియాలో రాశారు.
ఈ పరిస్థితి ఇడుపులపాయలో యాత్ర మొదలైన దగ్గర్నుంచీ ఉంది. పెన్షన్లు అందనివారు, సాయం పొందనివారు, ఉద్యోగాలు దక్కనివారు, అన్యాయమైపోయినవారు… వైకాపా లెక్కల్లో చెప్పాలంటే ఇప్పటివరకూ జగన్ ను కలిసినవారు లక్షలమంది ఉంటారు. మరి, వీరందరికీ జగన్ చేయబోయే న్యాయం ఏంటి అంటే… ఆయన ముఖ్యమంత్రి కావడం మాత్రమే! అంతవరకూ అందర్నీ వేచి ఉండండి అంటూ భరోసా ఇస్తూ యాత్ర చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి సాయం అందలేదు అంటూ తనకు ఫిర్యాదుల చేస్తున్నవారి వివరాలను ప్రభుత్వానికి జగన్ ఎందుకు పంపించడం లేదు..?
పాదయాత్ర మొదలై ఏడాది దాటిపోయింది కదా… తొలినాళ్లలో సమస్యలు చెప్పుకున్నవారి వివరాలను ప్రభుత్వానికి పంపించి, వారికి లబ్ధి చేకూర్చేలా ఒత్తిడి తెచ్చి ఉంటే… ఆ సమస్యల్లో ఉన్నవారికి ఈపాటికే పరిష్కారం లభించే అవకాశం ఉండేది! పెన్షన్లు అందడం లేదంటూ తన దగ్గరకి వచ్చిన వృద్ధుల వివరాలను, సాయం దక్కడం లేదంటూ వాపోతున్న రైతుల వివరాలను.. ఇలాంటివన్నీ సేకరించి, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపించి ఉంటే… వారికి వెంటనే న్యాయం జరిగేది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయి ఉంటే… అధికార పార్టీపై మరింత తీవ్రంగా పోరాడే బలమైన అంశం అయ్యేది. జగన్ పోరాటం వల్ల సమస్యలు తీరితే ప్రజలు వద్దంటున్నారా… జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ సమస్యలతోనే ఉండాలని ప్రజలు కోరుకుంటారా..? ఎన్నికలకు ఏడాది కిందట పాదయాత్ర ప్రారంభించి.. ఎప్పుడో తాను అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందంటూ హామీలు ఇస్తూ వెళ్లిపోతుంటే… సమస్యల్లో ఉన్నవారికి ప్రతిపక్ష నేతగా జగన్ ఏ రకమైన సందేశం ఇస్తున్నట్టు..?