రైతులకు పెద్ద ఎత్తున రుణ సౌకర్యం కల్పించే దిశగా ఏపీ సీఎం జగన్ బ్యాంకర్లను ఒప్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు.. ఏకంగా.. లక్షన్నర లక్షల కోట్ల వరకూ.., రైతులకు రుణాలుగా పంపిణీ చేయనున్నాయి. బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో రైతుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి.. గత ఏడాది కన్నా.. దాదాపుగా పన్నెండు శాతం ఎక్కువ రుణాలు ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,28,660 కోట్ల రుణాలు ఇస్తామని జగన్కు బ్యాంకులు హామీ ఇచ్చాయి. గత ఏడాది తాము.. రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న రుణాల్లో 99 శాతం ఇచ్చామని బ్యాంకులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి.
సున్నా వడ్డీ పథకం విషయంలో బ్యాంకుల సందేహాలను జగన్ తీర్చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇస్తామని.. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అయితే… వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు కూడా విరివిగా రుణ సౌకర్యం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు… ఈ భారీ రుణ వితరణలో వారికీ అవకాశం దక్కనుంది.
బ్యాంకుల నుంచి ప్రాజెక్టుల కోసం.. ఆర్థిక సాయం పొందేందుకు జగన్ ప్రయత్నించారు. సాగు నీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. కరోనా కారణంగా రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాంకులు కూడా… అప్పులు ఇవ్వాలంటే… ఆచితూచి వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో వ్యవసాయ రుణాలు లక్ష్యానికి మించి ఇచ్చేలా చూసేందుకు జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జగన్ సంకల్పానికి సహకరించేందుకు బ్యాంకర్లు కూడా.. సిద్ధమయ్యారు.