ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడారు. ఆ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం తప్ప కొత్తగా ఏం లేదు..! తిత్లీ తుఫాను గురించి మాట్లాడుతూ… ఆ అంశాన్ని అడ్డం పెట్టుకుని కూడా విమర్శలు చేశారు జగన్. తుఫాను వస్తుందని వారం ముందే అందరికీ తెలుసనీ, మీడియాలో కథనాలు వచ్చాయనీ, ముందే తెలిసినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని అడుగుతా ఉన్నా అని ప్రశ్నించారు.
తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏమాత్రం సహాయ చర్యలు లేవనీ, తాగడానికి నీరు అందడం లేదనీ, కరెంట్ ఏమాత్రం లేని పరిస్థితి ఉందనీ, దాంతో అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడుని గట్టిగా నిలదీస్తున్నారని జగన్ అన్నారు. సాయం అడుగుతున్న ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నదాన్ని బయటకి తెలియకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సముద్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకుంటున్నారట అంటూ ఎద్దేవా చేశారు. ఇంతకుముందు హుద్ హుద్ తుఫాను వస్తే జయించానని ఈ పెద్ద మనిషి సంబరాలు చేయించుకున్నారని జగన్ అన్నారు. తిత్లీ బాధితులకు ఓ రెండొందల రూపాయల సరుకులు చొప్పున ఇచ్చేసి చేతులు దులుపుకున్నారన్నారు. చంద్రబాబును అక్కడి ప్రజలు నిలదీస్తుంటే… ఆయన్ని అభినందిస్తున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ఈ పెద్ద మనిషి ప్రచారం చేయించుకున్నారని ఆరోపించారు. ఇంతకంటే దిక్కుమాలిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అన్నారు!
ఈ మాటలు వింటుంటే.. వాస్తవాలతో జగన్ కి పనుండదా అనిపిస్తుంది! తుఫాను హెచ్చరికలు జారీ చేసిన తరువాత ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం చేపట్టింది. కాబట్టే, కొంతైనా ప్రాణనష్టం తగ్గింది. ఇంకోటి… తిత్లీ తుఫాను బీభత్సం అంచనాలకు మించి ఉంది. తుఫాను వదిలిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. సహాయక చర్యలు త్వరగానే మొదలయ్యాయి. బాధితులకు తక్షణ సాయం కింద 50 కిలోల బియ్యంతోపాటు పప్పులూ ఉప్పులూ కూడా వీలైనంత త్వరగా అందించారు. విరిగిపడిన విద్యుత్ స్తంభాలను బాగు చేయడం, కూలిన చెట్లను, పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయడం కోసం పెద్ద ఎత్తున సిబ్బందిని రంగంలోకి దించారు. ఈయన ఎక్కడో సాలూరులో నిలబడి మాట్లాడుతూ… తుఫాను బాధితులకు ఏ సాయమూ అందడం లేదని ఈజీగా మాట్లాడేస్తే ఎలా..? కనీసం ఈరోజు వరకూ అక్కడి జరిగిన సహాయక చర్యల వివరాలు తెలుసుకుని మాట్లాడాలి కదా..?
జగన్ మాటల్లో గమనించాల్సిన మరో కోణం… తుఫాను బాధితుల పట్ల ఎక్కడా సానుభూతి వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. తిత్లీ తుఫాను అనేది చంద్రబాబు నాయుడును విమర్శించానికి దొరికిన మరో అంశంగా మాత్రమే జగన్ చూస్తున్నారనడంలో సందేహం ఏముంది..!