పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. కేంద్రం సరిగా సహకరించకపోయినా పట్టుదలతో ఉద్యోగులూ ఇంజినీర్లూ అందరూ కష్టపడి పనిచేశారనీ, ఇదే ఉత్సాహం పనులు ముందుకు సాగుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి తీరతామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే, పోలవరం ప్రాజెక్టు పనుల తీరుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
పోలవరం పునాది గోడ కట్టి, దాన్ని జాతికి అంకితం చేసిన నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు తప్ప వేరెవ్వరూ కాదని జగన్ ఎద్దేవా చేశారు. ఒకే ప్రాజెక్టుకి ఇప్పటికి ఐదుసార్లు శంకుస్థాపన చేశారనీ, పునాది స్థాయి కూడా ప్రాజెక్టు పూర్తికాలేదుగానీ జాతికి అంకితమట అంటూ విమర్శించారు. ఆయన ఓ గోడ కడితే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టినట్టుగా ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిందన్నారు. మనం ఇంటికి వేసుకునే పునాదినే డయాఫ్రం వాల్ అంటారని జగన్ చెప్పారు! మొత్తం పోలవరం పనుల్లో చూసుకుంటే… నాలుగేళ్ల చంద్రబాబు హయాంలో పూర్తయినవి కేవలం 20 శాతానికి మించి ఉండవని జగన్ అన్నారు. కానీ, 55 శాతం పనులు పూర్తి చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కానీ, ఈ 55 శాతంలో జరిగిన పనుల్లో పూర్తయినవి ఏంటంటే… దీన్లో దాదాపు డెబ్బై శాతం పోలవరం కుడి, ఎడమ కాలువ పనులు మాత్రమే అని చెప్పారు. అవి కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ హయాంలో జరిగినవి అన్నారు.
పోలవరంలో కాంక్రీటు పనులు కూడా ఏమంత గొప్పగా జరగడం లేదనీ, కానీ తానేదో యుద్ధ ప్రాతిపదిక పనులు పూర్తి చేస్తున్నా అన్నట్టు సీఎం ప్రచారం చేసుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయనీ, ఆ ప్రాజెక్టు పూర్తయితే పై నుంచి కిందికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని ఈ పెద్ద మనిషికి తెలిసీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఉరకలు వేయించలేకపోతున్నారని జగన్ అన్నారు. పోలవరాన్ని అవినీతి ప్రాజెక్టుగా మార్చేశారనీ, తన వారికి లంచాలూ కమిషన్లు దక్కాలన్న ఉద్దేశంతోనే జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ తానే నిర్మిస్తానంటూ భుజానికెత్తుకున్నారని ఆరోపించారు. పోలవరం అంచనా వ్యయం రూ. 16 వేలు కోట్లు ఉంటే, చంద్రబాబు తీసుకున్నాక దాని వ్యయం రూ. 53 వేల కోట్లకు పెంచేశారని మండిపడ్డారు!
ఐదుసార్లు పోలవరం దగ్గర సీఎం శంకుస్థాపన చేశారని జగన్ ఎద్దేవా చేస్తున్నారు. కానీ, ఒకే పని కోసం చెయ్యలేదు కదా! పైగా, డయాఫ్రం వాల్ అనేది ఒక ఇంటికి పునాది వేసినంత ఈజీగా నిర్మాణం కాదు కదా! డయాఫ్రం వాల్ పైకి కనిపించదు. అంతమాత్రాన పనులు కానట్టేనా..? ఇక, అంచనా వ్యయం విషయానికొస్తే… ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరగడం సహజం. ఐదేళ్ల కిందట ఉన్న సిమెంట్ ధరకీ, ఇప్పటికీ తేడా లేదా..? అయినా, పోలవరం అంచనా వ్యయం అనుకోగానే ఇష్టానుసారం పెంచుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందా..? పైగా, ఇదో జాతీయ ప్రాజెక్టు. ఒకవేళ ఏదైనా స్థాయిలో అవినీతి జరిగితే ఇంతవరకూ భాజపా ఎందుకు ఊరుకుంటుంది..?