స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను విస్మయానికి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పదవులు పొందాలని అనుకుంటున్న వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆశనిపాతంలా మారుతున్నాయి. ఎన్నికలలో విజయం సాధించేందుకు సర్పంచ్ అభ్యర్థి సైతం కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం, గ్రామాల్లో మద్యాన్ని పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలకు తెరదించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలలో విజయం సాధించడం కష్ట సాధ్యమని, ప్రత్యర్ధులు డబ్బు వెదజల్లుతుంటే ఓటర్లు అటు వైపే మొగ్గు చూపుతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అంటున్నారు. దశాబ్దాల కాలంగా ఎన్నికలంటే డబ్బు, మద్యం పంపిణీ అని ఓటర్లు స్థిరపడిపోయారని, ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చేతులు కట్టుకుంటే పరాజయం పాలు కాకతప్పదని స్థానిక నేతలు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ సీనియర్ మంత్రి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ “ప్రజలకు అన్నీ మనమే ఇస్తున్నప్పుడు ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎందుకు పంపిణీ చేయాలి” అని కాస్త కటువుగానే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక ఎన్నికలు అంటే కులం, మతం, వర్గం వంటి ఎన్నో సమీకరణాలు ఉంటాయని, వాటికి సంక్షేమ పథకాలతో ముడిపెట్టడం మంచిది కాదని స్థానిక నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. ప్రజల్లో మార్పు తీసుకురావడం రాత్రికి రాత్రే జరిగే పని కాదని, దశలవారీగా ఎన్నికల సంస్కరణలు తీసుకు రావాలని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు స్థానిక అభ్యర్థుల ఎంపిక జరిగితే ఎన్నికలలో విజయం సాధించడం అంత సులభం కాదని అంచనా వేస్తున్నారు.