జగన్ కి చెందిన వై ఎస్ ఆర్ సి పి అత్యంత భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్ని వర్గాలతో పాటు , రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం తో కాపులకు భారీ ఝలక్ తగిలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఓటర్లలో అంతర్మధనం మొదలైనట్లు గా కనిపిస్తోంది.
2014లో కాపులకు రిజర్వేషన్లు హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మొదటి రెండు మూడేళ్ల పాటు ఆ విషయంపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆ సామాజిక వర్గం లో తెలుగుదేశం పార్టీపై కాస్త వ్యతిరేకత ఏర్పడింది. అయితే ఆ తర్వాత కాపు రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో పాస్ చేయించి చంద్రబాబు కేంద్రానికి పంపించారు. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల తో కాపు రిజర్వేషన్ల అంశం ఎప్పటికైనా తేలుతుందా అని అప్పట్లో ఈ అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు కి కాపు రిజర్వేషన్ల సమస్య విషయంలో కోత్త ద్వారాలను తెరిచాయి. ఆ పది శాతం లో సగం అంటే ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కాపుల లో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందన్న అభిప్రాయం అప్పటికే ఏర్పడిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించకపోవడం, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ అది కేవలం ఆఖరి నిముషంలో నెపాన్ని కేంద్రంపై వేయడం కోసం చంద్రబాబు ఎంచుకున్న మార్గం అని వారు భావించడం తో, ఆఖరు లో అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ల నుంచి 5 శాతం కాపులకు కేటాయించినప్పటికీ చంద్రబాబు పట్ల ఆ సామాజిక వర్గం లో సానుకూలత కనిపించలేదు. ఇటు వంటి అంశాల నేపథ్యంలో ఆ సామాజిక వర్గం లో చాలావరకు ఓట్లు 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పడలేదు. అదే సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ ని కూడా కాదని వైఎస్ఆర్ సిపి కి గంపగుత్తగా ఓట్లు వేసిన కాపు ఓటర్లలో ఇప్పుడు అంతర్మధనం మొదలైనట్లు గా కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వం నిర్ధ్వందంగా – కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని చెప్పడం , ఏడాదికి రెండు వేల కోట్ల చొప్పున కాపు కార్పొరేషన్ కి కేటాయిస్తానని చెప్పిన ఎన్నికల ముందు చెప్పిన జగన్ , ప్రభుత్వం ఏర్పాటు చేశాక బడ్జెట్లో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడం ప్రస్తుతం కాపు సామాజికవర్గ ఓటర్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు, ఇతర పార్టీల లోని కాపు ఎమ్మెల్యేలు ఈ సమస్యపై బలంగా స్పందించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంతర్మధనం ఏ నిర్ణయానికి దారితీస్తుందన్నది వేచి చూడాలి.