కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధానితో చెప్పానన్నారు. ఓవర్ డ్రాఫ్ట్ ల్లో రాష్ట్రం నడుస్తోందనీ, ఇకపై కేంద్ర సాయం తప్పనిసరిగా ఉండాలని కోరానన్నారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు హయాంలో విపరీతంగా అప్పులు పెరిగిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ… దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మద్యపాన నిషేధాన్ని దశలువారీగా పూర్తి చేస్తామనీ, వచ్చే ఎన్నికల నాటికి కేవలం స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం ఉండేలా చర్యలు ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై ఎవరైతే సంతకం పెడతారో, వారికే తమ మద్దతు ఉంటుందని గతంలో జగన్ చెప్పారు. అయితే, ఇదే అంశమై ఆయన మాట్లాడుతూ… ఎన్డీయేకి కేవలం 250 సీట్లకు మించి రాకూడదని తాను కోరుకున్నాననీ, కానీ దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. 250 సీట్లు వచ్చుంటే, ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకనే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కేంద్రంలో వారికి ఇప్పుడు మన అవసరం లేదన్నారు. అలాగని, మనం వదిలేస్తే… దీని గురించి అందరూ మరచిపోతాన్నారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి తీసుకుని రాగలమో, ఆ తరహా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇకపై తాను ఢిల్లీకి తరుచూ వస్తుంటాననీ, అవసరమైతే ప్రధానమంత్రిని ముప్పై నలభైసార్లైనా కలుస్తాననీ, కలిసిన ప్రతీసారీ హోదా గురించి అడుగుతూనే ఉంటానని జగన్ అన్నారు. ఏదో ఒక రోజు వస్తుందనీ… ఆ రోజు వరకూ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందన్నారు జగన్.
సో… ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం ఇంకా కొనసాగించాల్సిందే! కేంద్రంలో వైకాపా ఎంపీల మద్దతు అవసరం లేని ప్రభుత్వం వచ్చింది కాబట్టి… ప్రధాని కూడా ఇప్పట్లో సానుకూలంగా స్పందించే అవకాశం లేదని జగన్ మాటల్లోనే తెలుస్తోంది. మరి, జగన్ కూడా చంద్రబాబు నాయుడు మాదిరిగానే హోదా కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారన్నమాట! భవిష్యత్తులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా జగన్ ప్రభుత్వం ఏ తరహా మార్గాల్లో ప్రయత్నిస్తుందో చూడాలి.