జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. హడావుడిగా వెళ్లిపోవడంతో.. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని.. ప్రచారం జరిగింది. అయితే.. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందో లేదో కానీ..ఆయన హస్తినకు వెళ్లడం మాత్రం ఖాయమయిందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని తరలింపును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆరెస్సెస్, వీహెచ్పీ లాంటి సంస్థలు కూడా.. ఇందులో కుట్ర కోణాన్ని చూశాయి. కేంద్రానికి వరుస ఫిర్యాదులు వెళ్లాయి. మొదట్లో సానుకూలంగా మాట్లాడిన కన్నా.. ఇప్పుడు… జగన్ పై అత్యంత తీవ్రంగా విమర్శలతో దాడి చేస్తున్నారు. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని తరలించడానికి ఎంత ధైర్యం అని బీజేపీ నేతలంతా హుంకరిస్తున్నారు.
కేంద్ర నిఘా సంస్ధలు కూడా.. రాజధాని తరలింపు వెనుక ఉన్న బాగోతాల నివేదికను.. పెద్దలకు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. జర్నలిస్ట్ శేఖర్ గుప్తా ఏపీ రాజధాని అమరావతి మార్పుపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికెళ్లినట్లుగా తెలుస్తోంది. అందుకే.. జగన్ కు.. ఢిల్లీ నుంచి తమ అభిప్రాయం మేరకు స్పష్టమైన సందేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో..ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవాలని… తన నిర్ణయానికి మద్దతు పొందాలని ప్రయత్నిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకున్న తర్వాత బీజేపీ నేతలు అడ్డుపడితే అభాసుపాలు కావాల్సి వస్తుందని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆయన ఢిల్లీ వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. జనవరి 4వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందే ఓ సారి ప్రధానిని కలిసి మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.
అమరావతి ఖర్చు… ఇన్ సైడర్ ట్రేడింగ్ .. వంటి వాటిపై నివేదిక ఇచ్చి.. సీబీఐ విచారణ చేయాలని.. ప్రధానిని జగన్ కోరతారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని వ్యవహారాన్ని చక్కబెట్టే ముందు ఢిల్లీ వెళ్లి మద్ధతు సంపాదించేందుకు జనవరి 3వ తేదీలోపుగానే లేదా 4 నుంచి జనవరి 14వ తేదీలోగానే ప్రధానమంత్రి, హోంమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేయాల్సిందిగా అధికారులను, ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలకు ఆదేశాలు వెళ్లాయి.