మంగళగిరిలో వైసీపీ టిక్కెట్ ఇస్తారని టీడీపీని వదిలేసిపోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న గంజి చిరంజీవి టిక్కెట్ ను జగన్ రెడ్డి చించేశారు. ఆయనకు బదులుగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను సీఎం జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. నియోజకవర్గ నేతలతో సమావేశమైన ఆయన.. గంజి చిరంజీవి పరిస్థితి ఏమీ బాగోలేదని రిపోర్టులు వచ్చాయని.. మళ్లీ గెలిచాక మంచి పదవి ఇస్తామని.. కాండ్రు కమలను గెలిపించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని జగన్ గంజి చిరంజీవిని టీడీపీ నుంచి ఆకర్షించారు. టీడీపీలో మంగళగిరి తరపున 2014 తరపున పోటీ చేసి పోస్టర్ బ్యాలెట్ల కారణంగా ఓడిపోయారు.
ఇరవై ఓట్ల తేడాతో ఓడిపోయినా.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంగళగిరి అనధికారిక ఎమ్మెల్యేగా చెలామణి అయ్యారు. లోకేష్ పోటీ చేయాలని నిర్ణయించడంతో ఆయనకు మళ్లీ టిక్కెట్ దక్కలేదు. కానీ ఆయనకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. గత ఏడాదే ఆయనను వైసీపీలోకి ఆకర్షించారు. ఆయనకే టిక్కెట్ అని ఖరారు చేశారు. ఈ కారణంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ కి గుడ్ బై చెప్పారు. కానీ ఇప్పుడు…ఆయనకూ టిక్కెట్ లేదని అంటున్నారు.
కాండ్రు కమల కాంగ్రెస్ లో నుంచి టీడీపీకి వచ్చారు.. చాన్స్ ఉండదని తెలిసి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ టిక్కెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లోపే జగన్ టిక్కెట్ ఆఫర్ చేశారు. అయితే చివరికి అభ్యర్థిగా ఎవరిని పెడతారో బీఫాం ఇచ్చే వరకూ తెలియదని జగన్ రెడ్డి నిర్ణయాల్లో నిలకడలేని తనం చూసిన వారు అంటున్నారు.