కోర్టుకు వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయమే.. అత్యంత ఆవేదనతో ఓ ట్వీట్ పెట్టారు. కుటుంబాన్ని కూడా వదలకుండా… దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. ఓ వర్గం మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేశపడ్డారు. తన భార్య భారతిపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న అర్థంలో ట్వీట్ చేశారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో వైఎస్ జగన్ భార్య భారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఇంగ్లిష్, తెలుగు అనే తేడా లేకుండా పత్రికలన్నింటిలో… వచ్చింది. ఆమెకు ఐదో నెంబర్ కేటాయించారని కూడా వెల్లడించింది.
ఒక్క సాక్షి పత్రికలో మాత్రమే భారతిపై ఈడీ చార్జిషీట్ గురించి రాలేదు. ఇదంతా తప్పు అని చెప్పాలని వైఎస్ జగన్ అనుకున్నారు. అందుకే ఉదయమే ట్వీట్ చేశారు. మిగతా అన్ని పత్రికలను ఓ వర్గపు పత్రికలుగా చెప్పుకున్నారు. జగన్ ట్వీట్ చూసి.. చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏదో ఒకటో రెండో పత్రికలు రాస్తే.. అనుకోవచ్చు కానీ… జాతీయ దినపత్రికలు కూడా రిపోర్ట్ చేసిన దాన్ని ఖండించే పద్దతి అది కాదని అంటున్నారు. నిజంగా భారతిపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేయకుంటే.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చి.. వివరణ ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయా పత్రికలకు వార్నింగ్ ఇవ్వవచ్చు. కానీ.. అంతా రాజకీయమేనన్నట్లు ట్వీట్ చేయడం తప్పించుకునే ప్రయత్నమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మళ్లీ ఆ ట్వీట్‌లోనూ కుటుంబ ప్రస్తావన తీసుకువచ్చి సానుభూతి కోసం జగన్ ప్రయత్నించినట్లు విమర్శలు వస్తున్నాయి. నేరం చేసిందో.. లేదో ఈడీ చూస్తుంది కానీ… జగన్ ఫ్యామిలీనా కాదా.. అన్నది చూడదు. రాజకీయాల కోసం కుటుంబాన్ని రచ్చకీడుస్తున్నారన్న జగన్ ఆవేదన కూడా.. చాలా కామెడీగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై… జగన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఇప్పటికీ.. హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. సమయం, సందర్భం లేకుండా.. కేవలం రాజకీయంగా తనను ప్రశ్నించారన్న ఉద్దేశంతోనే జగన్ అంత అసహనానికి గురై.. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడు తనదాకా వస్తే కానీ తెలియలేదన్నట్లు ఉంది జగన్ పరిస్థితి.
నిజానికి వైఎస్ భారతి విషయంలో … ఏ మీడియా సంస్థ కూడా.. ఓవర్‌గా రిపోర్ట్ చేయలేదు. ఎనాలసిస్ చేయలేదు. కేవలం… భారతిపై చార్జిషీట్ దాఖలు చేసిందని మాత్రమే చెప్పింది. తన భార్య పేరును అలా బయపెట్టారన్న కోపంతోనే.. జగన్ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. చార్జిషీట్ నిజంగా దాఖలు చేయలేకపోతే.. జగన్‌కు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవడానికి అంతకు మించిన అవకాశం దొరకదు. కానీ ఆ విషయం వదిలేసి.. రాజకీయం చేస్తున్నారని వాదించుకుంటూ.. తన చుట్టూ.. రాజకీయ కక్ష అనే రక్షణ కవచం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసుకోవడం ఎందుకు..?. అది పూర్తిగా పలాయనవాదమేనన్న విశ్లేషణలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.