పోలవరం రివర్స్ టెండరింగ్ … ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. ముందు గొయ్యి వెనుక నుయ్యి పరిస్థితిని తెచ్చి పెట్టింది. ఇప్పటికిప్పుడు కోర్టు తీర్పును గౌరవించలేరు.. అలా అని.. నవయుగ కాంట్రాక్ట్‌ను కొనసాగించలేరు. జగన్మోహన్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిన తర్వాత అధికారులతో.. ఉన్న పళంగా సమావేశమైనా.. ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. అప్పీలుకు వెళ్తే.. కేంద్రం ఎలా స్పందిస్తుందో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పీపీఏ నివేదిక.. ఏపీ సర్కార్‌కు మింగుడు పడటం లేదు.
నవయుగ ఇంజినీరింగ్ పనునలు సంతృప్తిగా ఉన్నాయని పోలవరం ప్రాజెక్ట్ ఆథారిటీ తేల్చింది. అవినీతి జరిగిందని చెప్పేందుకు ఎలాంటి లిఖితపూర్వక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ప్రీక్లోజర్ వల్ల ఒప్పంద నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుందన్న ఆథారిటీ… దీని వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో ప్రస్తుతం కాంట్రాక్టర్ మారితే ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యత ఎవరిదని పీపీఏ ప్రశ్నించింది. రివర్స్ టెండరింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరుగుతుందని పీపీఏ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు అథారిటీ నివేదికను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ నివేదికను అమెరికా నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు అందించారు.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై భవిష్యత్ వ్యూహంలో భాగంగా డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. కానీ తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. న్యాయపరమైన ఆదేశాలతో ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. అయితే రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో.. ఏపీ సర్కార్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి రోజంతా అధికారులతో సమీక్ష నిర్వహించినా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే.. ఏ సైడ్ ఎఫెక్ట్ వస్తుందో.. అంచనా వేసుకుని… నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కానీ.. ఏ దారి ప్రస్తుత సర్కార్ కు అంత సులువుగా కనిపించడం లేదు.