జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఆర్నెల్ల పాటు జనాలకి ఏమి చెప్పాలనేది ఇలాంటి యాత్రలు చేసే నాయకులందరికీ ఎదురయ్యే సమస్యే. ఎందుకంటే వాళ్ళు చెప్పదలుచుకున్న మ్యాటర్ మొత్తం మొదటి పది రోజుల్లో పూర్తయిపోతుంది- ఎంత గొప్పగా ప్రిపేర్ అయినా. జగన్ ప్రసంగాల్లో కూడా “రిపిటీషన్” వచ్చేసింది. బహుశా అందుకేనేమో ఈ మధ్య జగన్ తన ప్రసంగాల్లో నీతి కథలు చెబుతున్నాడు. మనం చిన్నపుడు చదువుకున్న కథలనే చంద్రబాబు కి ఏదోలా అన్వయించి మార్చి చెబుతున్నాడు. ఉదాహరణకి ఇటీవల చెప్పిన కథ ఇలా ఉంది.
‘అనగనగా ఓ పెద్ద పులి. అది అడవిలో ఉండేది. అడవిలోని జంతువులను అది మోసం చేసేది. అబద్ధాలు చెప్పేది.ప్రజలను, జంతువులను విపరీతంగా తినేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, మోసాలను, హత్యలను తట్టుకోలేక అక్కడున్న ప్రజలు దాన్ని అడవిలో నుంచి తొమ్మిదేళ్ల పాటు తరిమేశారు.ఇంచుమించి చంద్రబాబుని ప్రజలు ఏ విధంగా తొమ్మిదేళ్ల పాటు పదవి నుంచి తప్పించారో అలా. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ పులి అడవిలోకి వచ్చింది. అలా అడవిలోకి వచ్చిన పులిని ప్రజలు నమ్మలేదు. పులి వయసు కూడా పెరిగిపోయింది. ఇంచుమించుగా 70 ఏళ్లు వచ్చాయి. ఇక వేటాడే సామర్ధ్యం లేదని ఆ పులికి అర్థమైంది. అలా అర్థమైన మరుక్షణమే ఓ మనిషిని చంపేసి, అతని వద్ద ఉన్న బంగారు కంకణాన్ని తీసుకుంది. దాంతో ఊరి చివర ఉన్న చెరువు కట్టకు ఓ వైపు కూర్చుంది. దారిన పోయే వారితో అయ్యా నేను మారిపోయాను.నన్ను ఆదరించండి. ఇదిగో నా వద్ద బంగారు కడియం ఉంది. దీన్ని ముసలి వయసులో నేనేం చేసుకోవాలి. మీరే దీన్ని తీసుకోండి అని అనడం మొదలుపెట్టిందట. మొదట్లో ప్రజలు ఎవరూ పులిని నమ్మలేదు. కొంతకాలానికి పులిని చూసి చూసి.. దాని చేతిలో ఉన్న బంగారు కడియాన్ని చూసి ప్రజలకు ఆశ కలిగింది.మారిపోయిందట కదా దగ్గరికి పోతే బంగారు కడియం ఇస్తుందేమో అని చెప్పి వెళ్లినవారందరినీ పులి తినేయడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా ఇదే రీతిలోనే మన చంద్రబాబు నాయుడు కూడా.”
ఏది ఏమైనా జగన్ కథ బాగానే ఉంది. ఎటువంటి పులి అయినా మ్యాగ్జిమం 25-29 యేళ్ళకి మించి బ్రతకదు. కానీ దాన్ని 70 యేళ్ళ వయసున్న చంద్రబాబు తో పోల్చడానికి పులి వయసు 70 యేళ్ళుగా మార్చారు జగన్. అలాగే ఎక్కడైనా ప్రజలు పులి ని ఊరిలోనుంచి అడవిలోకి తరిమేస్తారు, అడవి లో నుంచి కాదు. అయినా సినిమాల్లోనే ప్రజలు లాజిక్కులు పట్టించుకోవడం మానేసారు, ఇక ప్రసంగాల సంగతి ఏముంది.
అయినా జగన్ ఇలాంటి నీతి కథలు చెప్పడం కొత్తేమీ కాదు..ఇదే పాదయాత్ర లో ఆ మధ్య దొంగ జపం చేసిన కొంగ కథని కూడా బాబు కి అన్వయించి చెప్పాడు. ఇంకా ముమ్నుందు ఎన్ని కథలు చెబుతాడో. అయినా తాబేలు-కుందేలు, సుమతి-కాలమతి, ఒకటేమిటి, తలుచుకోవాలే కానీ పంచతంత్ర కథలన్నిటినీ చంద్రబాబు కి అన్వయించి చెప్పొచ్చు.