” నేను.. నేనొక్కడ్నే…నాది ” అనుకునే మనస్థత్వం రాజకీయాల్లో ఎప్పుడూ రాణించదు. కానీ.. వారసత్వం కారణంగా అంతో ఇంతో పాపులారిటీ తెచ్చుకున్న నాయకులు… ప్రత్యామ్నాయాలు లేక.. నేతలుగా చెలామణి అవుతున్న నేతలు… తమది అంతా స్వయం ప్రకాశితం అనుంటూ ఉంటారు. తాము ఏది నిజం అనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. మీడియాకూ అదే చెబుతారు. దేశంలో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో జగన్ ఒకరు. ఆయన తన సాక్షి మీడియాకు.. తాజాగా ఇచ్చిన ఇంటంర్యూ మొత్తం .. నిజాలను అంగీకరించడానికి కానీ.. తన తప్పులను.. గుర్తించడానికి కానీ ఏ మాత్రం సిద్ధంగా లేరు. తనే నిజం అని కుండబద్దలు కొట్టారు. తనదే నిజాయితీ అని.. అందరూ అవినీతి పరులేనని తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పినట్లేగా..?
అసెంబ్లీ .. ప్రజాస్వామ్యానికి దేవాలయం. ఆ అసెంబ్లీని కించపరిచిన వాళ్లు చరిత్రలో లేరు. కానీ వైఎస్ జగన్ .. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అసెంబ్లీపైనే అభాండాలు వేసినంత పని చేశారు. అసెంబ్లీ బహిష్కరణకు కారణం… తన ఎమ్మెల్యేలు వెళ్లి అధికార పార్టీలో చేరడమేనట. తన పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరితే.. అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల ఎలా న్యాయం జరుగుతుందో .. జగన్ చెప్పలేకపోయారు. అదే సమయంలో.. తెలంగాణలో తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా… ఏపీ ఎంపీలు.. టీడీపీలో చేరినా… ఆయా చోట్ల.. ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారన్నదానిపైనా… సమాధానం చెప్పుకోలేకపోయారు. లోక్సభలో ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేసినా… వైసీపీ ఎంపీలపై.. లోక్సభ స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదో.. ఇక్కడ టీడీపీపై చేస్తున్నంత తీవ్ర ఆరోపణలు బీజేపీపై ఎందుకు చేయలేదో మాత్రం చెప్పలేకపోయారు. దానికీ చంద్రబాబును కారణంగా చెప్పడానికి మాత్రం సంకోచించలేదు.
మోడీని ప్రశ్నించలేని దుస్థితి ఎందుకొచ్చిందో వివరణ ఇచ్చారా..?
ప్రత్యేకహోదా అంశం ఎన్నికల అంశమే. ఈ విషయంలో జగన్ స్ట్రాటజీ ఏమిటి..? చంద్రబాబును విమర్శించడమే.. జగన్ స్ట్రాటజీ. తన విధానం ఏమిటి. ? కేంద్రం న్యాయం చేస్తున్నా.. ఎందుకు ప్రశ్నించలేపోయారు.. అన్న ప్రజల అనుమానాలపై ఇసుమంత స్పందన కూడా వ్యక్తం చేయడానికి సిద్ధపడలేదు. కానీ అదే ప్రత్యేకహోదా విషయంలో మాత్రం… తాను ఇంకా ఏదో చేయబోతున్నట్లు.. తన ప్రయత్నాల్లో నిజం… నిజాయితీ ఉన్నట్లు మాత్రం.. ఏ మాత్రం తడబడకుండా చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ ను ఏ మాత్రం నమ్మడం లేదు కానీ.. ఇవ్వనంటున్న బీజేపీపై మాత్రం… అంత కన్నా ఎక్కువగా సానుభూతి చూపిస్తున్నారు. పాతిక లోక్ సభ సీట్లు ఇస్తే.. ప్రత్యేకహోదా ఫైల్ పై ఎవరు సంతకం పెడితే..వారికే మద్దతిస్తారట. నిజంగా.. అలాంటి పరిస్థితి వస్తే.. జగన్ ముందుగా కోరుకునేది.. తనకు ప్రత్యేకహోదా అనే విషయం అందరికీ తెలుసు. కేసుల నుంచి విముక్తి చేసే వారికే మద్దతిస్తారు. ఏపీ ప్రత్యేకహోదా సంగతి తర్వాత చంద్రబాబు వల్లే రాలేదని నిస్సిగ్గుగా ప్రకటించేస్తారు. అనేక సందర్భాల్లో నిజమయింది.
ప్రతిపక్షం ఫెయిలందని కేసీఆర్ అంటే.. నోరు పెగల్లేదేమిటి..?
సాక్షి ఉప్పు తింటున్న జర్నలిస్టే అయినా… దేవుల పల్లి అమర్.. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేశారు. ఏపీలో ప్రతిపక్షం ఫెయిలయిందని.. తాము రంగంలోకి దిగుతున్నామని కేసీఆర్ అన్నారు కదా.. అంటే.. దానిపై.. జగన్ కు సౌండ్ లేదు. ఏ ఉద్దేశంతో అన్నారో తనకు తెలియదని చెప్పుకొచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. జగన్పై ఫెయిల్డ్ ముద్ర వేసిన కేసీఆర్పై.. ఆయన ఏ విధంగా స్పందించాలి…? అంతేనా.. ప్రత్యేకహోదా అంశాన్ని అనేక సందర్భాల్లో వ్యతిరేకించి.. ఎన్నికల్లో దానే ప్రచారాస్త్రంగా చేసుకుని.. సెంటిమెంట్ పండించిన కేసీఆర్ .. లేఖ రాస్తా అనగానే.. ఆయనకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్లు ఇప్పటి రాజకీయ అవసరాలకు అవసరం లేదు కాబట్టి… జగన్ వాటిని మర్చిపోయారు. అంతే కాదు.. రైతు బంధు పథకం తన ఆలోచనే అని చెప్పుకొచ్చారు. రైతుభరోసా పేరుతో తానో పథకం ప్రకటించానని.. అదే కేసీఆర్ అమలు చేశారని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు.. తన వాదన ఇంకెంత బలంగా వినిపించాలి. కానీ.. పొడిపొడిగి మాటలతో కేసీఆర్ మనసుకు నష్టం కలగకుండా.. వ్యవహరించారు.
నేను.. నేను..నేను.. జగన్ స్టైల్ అంతే..!
ఇంటర్యూ మొత్తంలో జగన్… ఎక్కడ చూసినా.. తాను అనే అహాన్ని చూపించారు తప్ప.. ఎక్కడా… ఇతరల ప్రాధాన్యాన్ని గుర్తించేప్రయత్నం చేయలేదు. అంతే కాదు.. తనకు ఎవరితోనూ కలిసే మనస్థత్వం లేదు కాబట్టి.. ఇతరులు కూడా పొత్తులు పెట్టుకోవడం తప్పనే పద్దతిలో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ నిర్ణయాలను పదే పదే తప్పు పట్టారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని.. దానికి అనుగుణంగా లబ్దిపొందుతూ ఉంటాయి. అదే రాజకీయం. దాన్ని కూడా తప్పు పడుతూ.. తాను చేస్తోందే కరెక్టని చెప్పుకోవడం.. అహానికి పరాకాష్ట లాంటిది. ఈ విషయంలో చివరికి రాహుల్ గాంధీని కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏదో తన దగ్గరకు పొత్తులకు వచ్చినట్లు.. ఆయన బలం మీద పోటీ చేయాలని.. తాను సలహా ఇచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు. జగన్ కు తన బలం… సొంతంగా వచ్చినట్లుగా… తను ఆకాశం నుంచి ఉడిపడినట్లు… చెప్పుకొచ్చారు.
జగన్ ఇంటర్యూ మొత్తం.. ప్రజలు తనకు ఎందుకు ఓటేయాలంటే.. చంద్రబాబుకు ఓటేయకూడదు కాబట్టి.. అనే అర్థంలో చెప్పుకొచ్చారు తప్ప… ఎక్కడా… తన ప్లస్ పాయింట్లేమిటో… తను ఏమి చేయగలడో… తన ఆలోచనలేమిటో.. వివరించలేదు. అంతా.. చంద్రబాబు.. . చంద్రబాబు.. దట్సాల్..! ఇస్తే చంద్రబాబే అధికారం ఇవ్వాలన్నట్లుగా ఉంది జగన్ తీరు. …
— సుభాష్