ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో… ఎంపీ అభ్యర్థుల కోసం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వెదుక్కుంటోంది. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో.. పట్టుమని ఐదు స్థానాలకు.. కూడా.. కచ్చితంగా వీరే పోటీ చేస్తారని చెప్పలేని పరిస్థితి వైసీపీలో ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు బలహీనంగా ఉండటంతో వారి స్థానంలో వలసల్ని ప్రొత్సహించి అయినా.. బలమైన నేతల్ని తీసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కడప నుంచి ఈ సారి అవినాష్ రెడ్డి పోటీ చేయరని ప్రచారం జరుగుతోంది. అయితే.. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రంగంలోకి దిగుతారు. ఎవరన్నదానిపై క్లారిటీ లేదు. రాజంపేట పెద్దిరెడ్డి ఫ్యామిలీకి రిజర్వ్ చేశారు. కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరన్నదానిపై.. వైసీపీ తర్జన భర్జన పడుతోంది. ఎప్పటికప్పుడు సమన్వయకర్తల్ని మారుస్తూ పోతోంది. దాంతో ఎవరూ ఆయా నియోజకవర్గాలపై పట్టు సాధించలేకపోయారు. తిరుపతికి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ.. ఆయనకు ఈ సారి చాన్సివ్వరని చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు వలస వస్తే.. టిక్కెట్లు ఇవ్వడానికి వైసీపీ అధినేత రెడీగా ఉన్నారు.
ఇక నెల్లూరులో మేకపాటి పరిస్థితి డొలాయమానంలో ఉంది. అక్కడి నుంచి వైసీపీ నేతలు… టీడీపీ నేత అయిన మాగుంట పేరు ప్రచారంలోకి పెడుతున్నారు. ఒంగోలులో ఈ సారి షర్మిల పోటీ చేస్తుందని చెబుతున్నారు. కానీ వైవీ సుబ్బారెడ్డి.. తానే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. బాపట్ల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో… ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో.. తెలియక.. వైసీపీ నేతలు.. తలలు పట్టుకుంటున్నారు. ఇక గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లో… అయితే్.. సమన్వయకర్తలతో.. జగన్ ఓ ఆట ఆడుకున్నారు. అనేక మందిని మార్చి.. మార్చి చివరికి.. గుంటూరుకు ఉమ్మారెడ్డి అల్లుడు, నర్సరావుపేటకు లావు రత్తయ్య కుమారుడ్ని ఇన్చార్జులుగా పెట్టారు. కానీ వారికి టిక్కెట్లు ఇస్తారా..అంటే గ్యారంటీ లేదని చెబుతున్నారు. బలమైన నేతలు వలస వస్తే వారికి టిక్కెట్లు ఇస్తారట. విజయవాడలో పోటీకి చాలా మంది పారిశ్రామికవేత్తల్ని అడిగి లేదనిపించుకున్న తర్వాత… ఇరవై ఏళ్ల క్రితం రాజకీయాలకు గుడ్ బై చెప్పిన దాసరి జైరమేష్‌ను దగ్గుబాటి సాయంతో ఒప్పించగలిగారు. మచిలీపట్నంలో మాత్రం గుంటూరుకు చెందిన వల్లభనేని బాలశౌరికి టిక్కెట్ కేటాయించారు. అక్కడ ఆయన పని చేసుకుంటున్నారు.
ఇక ఉభయగోదావరి, ఉత్తరాంధ్రల్లో వైసీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. శ్రీకాకుళంలో అభ్యర్థులు లేక..మాజీ ఎంపి కిల్లి కృపారాణిని పార్టీలో చేర్చుకుంటున్నారు. విజయనగరంలో బొత్స కుటుంబానికి ఇవ్వాలా వద్దా అని తర్జన భర్జన పడుతున్నారు. అనకాపల్లిలో బలమైన నేత పేరు వినిపించడం లేదు. రాజమహేంద్రవరం నుంచి రాజకీయాలకు కొత్త అయిన మార్గాని భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఏలూరులో టీడీపీకి గట్టి పోటీ ఇవ్వాలటే.. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అయితేనే బెటరని ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. నరసాపురంలో ఎవరూ లేకపోవడంతో.. సిట్టింగ్ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడి కోసం గాలం వేస్తున్నారు. మొత్తంగా.. 25 నియోజకవర్గాల్లో గట్టిగా ఇప్పటికీ.. వైసీపీకి ఐదారు నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థులున్నారు. మిగతా వారి కోసం వెదుకుతున్నారు.