వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారధులుఇలా అందరూ భుజనా సంచి వేసుకుని ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తున్న సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వారం రోజుల పాటు విదేశాల్లో వేసవి విడిది చేయనున్నారు. కుటుంబంతో వెళ్లనున్న ఈ పర్యటన కోసం ఇప్పటికే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ పాస్ పోర్టుకోర్టు అధీనంలో ఉంటుంది. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా, జెరూసలెం, దావోస్ లలలోజగన్ పర్యటించారు. అన్నీ కుటుంబ పర్యటనలే. దావోస్ లో మాత్రం రెండు రోజులు పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు.
సీఎం జగన్ ఈ నెల 21వ తేదీన విదేశీ పర్యటనకు బయలుదేరే అవకాశం ఉంది. స్టిక్కర్లు అంటించే ప్రోగ్రాం 20వ తేదీ వరకే అనుకున్నారు. కానీ ఎండా కాలం కారణంగా ఈ కార్యక్రమం చాలా స్లోగా సాగుతోంది. అందుకే మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలంతా ఇలా ప్రత్యేకమైన కార్యక్రమంలో ఉండగా సీఎం జగన్ మాత్రం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లడం వైసీపీ క్యాడర్లో కాస్త విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి.
ఎక్కడకు వెళ్తారన్నది రహస్యంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది వరకూ ఎన్నికల కోసం పూర్తి బిజీగా ఉండాల్సి ఉంటున్నందున ఇప్పుడే అలా టూర్కు వెళ్లి రావాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.