ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం అత్యంత కీలకమైందిగా ఉంటుందని మొదట్నుంచీ అందరూ భావిస్తూ వచ్చారు. అయితే, ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి… ఆ అంశం ప్రధానంగా ప్రచారంలో కనిపించలేదు. కానీ, ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయిలో ఎంపీ స్థానాలు గెలుచుకుని హోదా సాధిస్తామని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. తాజా ఎన్నికల్లో ఈ హోదా అంశం వైకాపాకి అనుకూలంగా మారిందంటూ ఇప్పుడు కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి.
నిజానికి, గత టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో భాజపాతో పొత్తులో ఉండేది. ఎప్పుడైతే, హోదా ఇవ్వడం సాధ్యం కాదనీ, దానికి బదులుగా ప్యాకేజీ ఇస్తామని మోడీ సర్కారు తేల్చి చెప్పడంతో… టీడీపీ కూడా హోదా ప్రాధాన్యత గురించి మాటలు తగ్గించి, దానికి సమానమైన ప్యాకేజీ వస్తోంది కదా అని ఒప్పుకున్నారు. కానీ, ఆ ప్యాకేజీని కూడా కేంద్రం సరిగా అమలు చేయని పరిస్థితి వచ్చింది! అయితే, ఈలోగానే… ప్రత్యేక హోదా సాధించి తీరతామంటూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తొలిదశలోనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో… హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సరిగ్గా అదే సమయంలో… హోదా రాకపోతే ఉద్యోగాలు రావనీ, పరిశ్రమలూ రావనీ, ఉపాధి దక్కదని వైకాపా చేసిన ఉద్యమానికి యువత ఆకర్షితులయ్యారనే అభిప్రాయం ఉంది.
ఆ తరువాత… కేంద్రం ఏపీకి ఇస్తామన్న ప్యాకేజీని కూడా తాత్సారం చేయడంతో చివరికి టీడీపీ కూడా హోదా ఉద్యమాన్ని తలకెత్తుకుంది. దీంతో, హోదా సంజీవని కాదని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడెందుకు హోదా కోసం పోరాటం అంటున్నారనే చర్చ ప్రజల్లో జరిగింది. అంటే, హోదా విషయంలో వైకాపా చేస్తున్న పోరాట పంథాకే టీడీపీ కూడా వచ్చిందనీ, హోదాకి ప్రత్యామ్నాయం ప్యాకేజీ కాదని టీడీపీ కూడా ఒప్పుకున్నట్టే అయిందనే అభిప్రాయం చాలావరకూ స్థిరపడిపోయింది. ఇదేదో ప్యాకేజీ ప్రకటిస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. ఆ తరువాత ధర్మపోరాట దీక్షలంటూ చంద్రబాబు నాయుడు కేంద్రంపై తిరగబడ్డా కూడా… టీడీపీ మీద ప్రజల్లో ఏర్పడ్డ అభిప్రాయం మారలేదని విశ్లేషకులు అంటున్నారు. హోదా సాధన విషయంలో మొదట్నుంచీ వైకాపా ఒకే వైఖరితో ఉందనే భావన ప్రజల్లోకి వెళ్లింది. ఈ రకంగా ఏపీ ప్రత్యేక హోదా అంశం వైకాపా విజయానికి తోడ్పడిందని చెప్పొచ్చు. అయితే, ఎవరైతే హోదాకి ఓకే అంటారో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ అన్నారు. పరిస్థితి చూస్తుంటే… కేంద్రంలో ఎవరి మద్దతూ అవసరం లేని స్థాయిలో భాజపా ఉంది. హోదా అసాధ్యమని చెప్పిన పార్టీయే మరోసారి ఢిల్లీ గద్దెనెక్కుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎలా సాధిస్తారో వేచి చూడాలి.