వైఎస్ జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి, రైతుల గురించి తెగ మాట్లాడేస్తున్నారు. పథకాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ సాక్షి మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరి ఇవే మాటల్ని జగన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ఎందుకు చెప్పరనేది సామాన్యులకు వస్తున్న సందేహం. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆయనకు ఆయన ఊహించుకుంటున్నారు. కానీ వెళ్తేనే కదా ఇస్తారో లేదో ప్రజలకైనా తెలుస్తుంది.
జగన్ రెడ్డి బయట చెబుతున్నవి..ప్రెస్మీట్లలో చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు. కనీసం వక్రీకరించడం కూడా కాదు. నేరుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వంశీ కేసు విషయంలో కానీ.. మిర్చి ధర విషయంలో కానీ తాను అమలు చేశానని చెబుతున్న పథకాల విషయంలో కానీ జగన్ రెడ్డి చెబుతున్న దాంట్లో ఒక్క నిజం లేదు. అసెంబ్లీకి హాజరై.. జగన్ ఈ మాటలు చెబితే .. మొత్తం సాక్ష్యాలతో సహా అధికారపక్షం ప్రజల ముందు పెడుతుంది.
జగన్ రెడ్డి హయాంలో శాంతిభద్రతల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ అరాచకాన్ని ప్రజలు గుర్తించలేదు. టీడీపీ ఆఫీసులపై , నేతల ఇళ్లపై వైసీపీ మూకలు పడితే.. బీపీ వచ్చిందని సమర్థించుకున్న జగన్ రెడ్డి నిర్వాకాలు మొత్తం మరోసారి ప్రజలకు గుర్తు చేస్తారు. మిర్చి రైతులు పదేళ్ల పాటు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక ఏడాది పంట మొత్తం నాశనం అయిపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేయని దుర్మార్గ ప్రభుత్వం అది. మార్కెట్ ధర పన్నెండు, పదమూడు వేలు ఉన్నప్పుడు ఏడువేల మద్దతు ధర ప్రకటిస్తూ జీవో జారీ చేసి రైతుల్ని మరింతగా ముంచారు. మిర్చి ధరలపై అసెంబ్లీలో మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయనే ఆయన అసెంబ్లీలో మాట్లాడరు.
జగన్ రెడ్డి ఘోరమైన పనులు చేశారు.. అసెంబ్లీలో మాట్లాడితే వాటికి సంబంధించిన నిజాలను బయటపెడతారనే ఆయన అసెంబ్లీకి పోవడం లేదు. దానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదనే కారణం అడ్డం పెట్టుకుంటున్నారు.