హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నామస్మరణ చేయనిదే రోజు గడవదన్న సంగతి తెలిసిందే. ఆయన ఉపన్యాసం మొదలుపెడితే దానిలో నిమిషానికొకసారైనా చంద్రబాబు ప్రస్తావన ఉంటుంది. విద్యార్థులలో ప్రత్యేకహోదా ఉద్యమ స్ఫూర్తిని రగల్చాలని కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్న జగన్, ఆ క్రమంలో ఇవాళ కాకినాడలో యువభేరి అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఒక రేంజిలో చెలరేగిపోయారు. చంద్రబాబుకు చర్మం మందమై పోయిందని, అందుకే సమస్యలపై స్పందించటంలేదని అన్నారు. చంద్రబాబును చూస్తుంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనే సామెత తనకు గుర్తుకొస్తోందని చెప్పారు. ఆయనకు సిగ్గూ-ఎగ్గూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఉన్న ఉద్యోగాలనే బాబు తీసేస్తున్నాడని, ఇంకా కొత్త ఉద్యోగాలను ఎక్కడనుంచి తెస్తాడని ప్రశ్నించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తలను అన్యాయంగా తొలగించారని, అంగన్వాడిలపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రకటనలు రావటంలేదని, అభ్యర్థులు కోచింగ్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. తెలందాణలో 9,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఏపీలో 1,42,828 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఇవ్వాలన్న తాపత్రయం లేదని అన్నారు. ఏపీలో ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం అని చెప్పారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అన్నారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర, కేంద్ర పెద్దలను చొక్కాపట్టుకుని నిలదీయాలని జగన్ సూచించారు. చంద్రబాబు పరిశ్రమలకోసం సింగపూర్, దావోస్, మలేషియా వెళ్ళనవసరం లేదని, ఢిల్లీ వెళ్ళి ప్రధానిపై ఒత్తిడి తేవాలని అన్నారు.