శాసనసభ సభాపతి స్థానం అంటే అది గౌరవప్రదమైన, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవి. ఆ దపవిలో ఉన్నది ఎవ్వరైనా సరే.. ఆ సమున్నతమైన గౌరవానికి అర్హులు. రాజకీయ నాయకులు కూడా ఇతర పార్టీలకు చెందిన వారైనా ఆ పదవిలో ఉన్న వ్యక్తి పట్ల అగౌరవంగా మాట్లాడడం తగదు. అలాగే ఆ పదవిలో ఉన్నవారు రాజకీయంగా తన-పర భేదాలను విడచి వ్యవహరించాలి. కానీ నవతరం రాజకీయాల్లో నిర్వచనాలు మారిపోతున్నాయి. స్పీకరు స్థానంలోకి వచ్చినంత మాత్రాన పార్టీ రంగును పులుముకోకుండా నాయకులు ఉండలేకపోతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల విషయానికే వస్తే.. స్పీకరు వంటి రాజ్యాంగపదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పసుపు కండువాలు వేసుకుని పాల్గొనడం చాలా వివాదాలకు దారితీసింది. ఆరకంగా విలువలను స్పీకర్లు గాలికొదిలేస్తున్నట్లే.. స్పీకరును గౌరవించాలనే ధర్మాన్ని కూడా విపక్ష నాయకులు తుంగలో తొక్కేస్తున్నారు. తాజాగా చంద్రబాబును నేరగాడిగా అభివర్ణించే ప్రయత్నంలో ఆయన చుట్టూ అంతా నేరగాళ్లే ఉన్నారని ఆరోపించే ప్రయత్నంలో విపక్షనేత వైఎస్ జగన్ , స్పీకరు కోడెల శివప్రసాద్‌ను కూడా నేరగాడిగా అభివర్ణించి కొత్త వివాదానికి తెరతీశారు. ఒక రకంగా ఈ చర్య ద్వారా జగన్, కోడెలను బ్రేకింగ్ పాయింట్ దాక్కా లాక్కువెళ్లారని అనిపిస్తున్నది.
స్పీకరు స్థానంలోకి వచ్చిన తర్వాత.. రెగ్యులర్ రాజకీయ నాయకుడిలాగా వ్యక్తుల మీద వ్యక్తిగత నిందారోపణలతో ఎన్నడూ మాట్లాడకుండా కోడెల జాగ్రత్తగానే ఉన్నారు. కానీ తాజా పరిణామాల్లో ఆయన జగన్ మీద చాలా దారుణమైన ప్రతి విమర్శలకు దిగడం విశేషం. దేశం మొత్తం మీద వారానికి ఒకసారి కోర్టుకు వెళ్లివస్తూ ఉండే నేత జగన్ కూడా తన గురించి విమర్శలు చేస్తారాఅంటూ స్పీకర్ నిప్పులు చెరిగారు. జగన్ క్రిమినల్లా మాట్లాడుతున్నారని.. రాజనీతిజ్ఞుడిలాగా వ్యవహరించడాన్ని నేర్చుకోవాలని హెచ్చరించారు. సభాపతి అయిన తర్వాత గత 20 నెలల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో జగన్ గురించి తాను మాట్లాడలేదంటూ కోడెల చెప్పడం గమనార్హం.
తుని దుర్ఘటనల ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని.. ఎంతో సహనంతో వ్యవహరించే ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఉద్వేగానికి గురరిచేసినది జగనే అంటూ కోడెల సభాపతిలా కాకుండా సాధారణ రాజకీయ నాయకుడిలా ఆరోపణలు చేయడం విశేషం. అందుకే కోడెలను బ్రేకింగ్ పాయింట్ వరకు లాక్కువెళ్లారా అని అనుకోవాల్సి వస్తోంది.