ప్రత్యేక హోదాపై మళ్ళీ పోరాటం మొదలుపెట్టిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరులో యువభేరి పేరిట విద్యార్ధులతో ఒక సమావేశం నిర్వహించారు. దానిలో వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒకవేళ చంద్రబాబు నాయుడు స్వాతంత్ర సమర సమయంలో కనుక ఉండి ఉంటే, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవినా? స్వాతంత్ర్యం వస్తే సరిపోతుందా? దాని వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా? అని వాదించి ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళనే పరిపాలించుకోమని ఉండేవారు. కానీ మన అదృష్టవశాత్తు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పుట్టలేదు. కనుక బ్రతికిపోయాము. కానీ మన దురదృష్టం కొద్దీ ఇటువంటి సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించుకొని రావలసిన ముఖ్యమంత్రి అదేమయినా సంజీవినా? ప్రత్యేక హోదా రాకపోతే ఏమవుతుంది? వస్తే నేనేమైనా కాదన్నానా? అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయనకి ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయారు? అంటే కేసుల భయం చేతనే,” అని తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు నాయుడుని నిలదీయడంలో తప్పులేదు. ప్రత్యేక హోదాపై మాట మారిస్తే నిలదీయడంలో కూడా తప్పు లేదు.కానీ అభంశుభం తెలియని విద్యార్ధులని ఆకట్టుకోవడానికి స్వాతంత్ర సమరంలో చంద్రబాబు నాయుడు పుట్టడం, ఆయన స్వాతంత్ర్యం వద్దని కోరుకొంటారని ఊహజనితమైన కబుర్లు చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది.
ఒకప్పుడు సర్గీయ రాజశేఖర్ రెడ్డి 108 సర్వీసుల గురించి ప్రసంగిస్తున్నపుడు అవి ఒక ఫోన్ కొట్టగానే “కుయ్..కుయ్.. కుయ్..కుయ్..”మంటూ వచ్చేస్తాయి అని చెప్పినప్పుడు, ఆయన చెప్పిన ఆ తీరుకి ప్రజలు చాలా ముచ్చటపడేవారు. ఆ సంగతి గ్రహించిన ఆయన ప్రజలని అలరించేందుకు అప్పుడప్పుడు ఆ కుయ్..కుయ్ ముక్కలు పలికేవారు.
ఆవిధంగా ఆయన చెప్పడం వలన ఎవరినీ బాధ పెట్టలేదు. ఒక గొప్ప పని చేయడమే కాకుండా ప్రజలని తన మాటలతో కూడా సంతోషపెట్టేవారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రిని అనుకరించడానికి చాలా ప్రయత్నించారు కానీ జనాల నుంచి అటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ చప్పుళ్ళు చేయడం మానుకొన్నారు. ప్రజలని ఆకట్టుకోవడానికి రాజకీయ నాయకులు రకరకాల ప్రయత్నాలు చేయడం సహజమే కానీ ఈవిధంగా ఊహాజనితమైన కట్టు కధలతో ఆకట్టుకోవాలనుకొంటే వాళ్ళే నవ్వుల పాలవుతారు.
“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయడం లేదు?” అని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా దానిని మంజూరు చేసే శక్తి, అధికారం లేని చంద్రబాబు నాయుడునే నిందిస్తున్నారే తప్ప ధైర్యంగా ప్రధాని నరేంద్ర మోడీని పేరుపెట్టి నిలదీసే సాహసం చేయడం లేదు. తన అక్రమాస్తులపై సిబిఐ కేసులు..ఈడి కేసులు మళ్ళీ వేగం పుంజుకొంటాయనే భయంతోనే అని తెదేపా నేతల వాదనని కాదనగలరా?ఈరోజు ప్రసంగంలో కూడా ఆయన ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో విమర్శించకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు, కేంద్రప్రభుత్వం, భాజపా, 14వ ఆర్ధిక సంఘం అంటూ నిందించడం గమనిస్తే ఆయన కూడా ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీని పేరుపెట్టి నిలదీయడానికి ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుంది.
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేటప్పుడు బాబు పుట్టకపోవడం మన అదృష్టం లేదంటే స్వాతంత్రమేమయినా సంజీవనా అనేవాడు: @ysjagan pic.twitter.com/FMD0DUaOza
— YSR Congress Party (@YSRCParty) August 4, 2016