వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో విశాఖలో సినీ పరిశ్రమ స్టూడియోల కోసం 300 ఎకరాలు కేటాయించారని.. ఇప్పుడు వాటిని మళ్లీ కేటాయించే అంశం పరిశీలిస్తామని.. టాలీవుడ్ బృందానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. చిరంజీవి నేతృత్వంలో ఏడుగురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా..సినీ పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహకాలపై చర్చలు జరిగాయి. చర్చల తర్వాత మీడియాతో మాట్లాడిన చిరంజీవి…ముఖ్యమంత్రి జగన్ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్ సమయంలో షూటింగ్లు స్తంభించిపోయాయని .. షూటింగ్లు చేసుకునేందుకు పదిహేనో తేదీ నుంచి అనుమతి ఇస్తామని జగన్ చెప్పారని .. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం అన్నారని చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారు. 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు.
ఏడాది నుంచి సీఎం జగన్ ను కలవాలనుకుంటున్నామని ఇప్పటికి కుదిరిందన్నారు. మీడియాతో చిరంజీవి ఒక్కరే మాట్లాడారు. ప్రభుత్వం తరపున విడిగా మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. కరోనా సమయంలో థియేటర్ల విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని ప్రకటించారు. సినిమా టికెట్ల ధరలను ఆన్లైన్లోనే విక్రయించాలని కోరారని …అలాగే.. 2019-20 నంది అవార్డుల వేడుకను జరుపాలని కోరారని.. దానికి కూడా సీఎం అంగీకరించారన్నారు. విశాఖలో స్టూడియోలు నిర్మించాలనుకుంటే తక్కువ ధరలకు భూములు ఇస్తామని పేర్నినాని ప్రరకటించారు. భవిష్యత్లో సినిమావారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లుగా పేర్ని నాని తెలిపారు. కొద్ది రోజుల కిందటే.. ఏపీలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పదిహేనో తేదీ నుంచి తాజాగా షూటింగ్లకు పర్మిషన్ ఇస్తున్నట్లుగా చిరంజీవి ప్రకటించారు. విశాఖలో స్టూడియోల అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి తో పాటు మంత్రి పేర్ని నాని కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. సినిమా ధియేటర్ల ప్రారంభోత్సవం కేంద్రం నిర్ణయం మీద ఆధారపడి ఉండటం.ో…ఆ అంశంపై చర్చ జరగలేదని తెలుస్తోంది. అయితే ధియేటర్లకు కరెంట్ చార్జీలు తగ్గింపు.. ఫిక్స్డ్ చార్జీల తగ్గింపు వంటి వాటిపై పరిశ్రమ పెద్దలు హామీ పొందారు.