అనుకున్నది పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనే అయినా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పర్యటనను పూర్తి చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విలీనమండలాల ప్రజలను కలవడానికి బయలుదేరినా జగన్ అక్కడికి వెళ్లలేకపోయాడు. భారీ వర్షాలతో లంక గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో జగన్ అక్కడకు వెళ్లలేకపోయాడు కానీ.. వివిధ రకాల పరామర్శలు, బాధితులను పలకరిస్తూ జగన్ గోదావరి జిల్లాల పర్యటన సాగింది.
మరి ఈ పర్యటనకు వచ్చిన స్పందన చూస్తే బాగానే ఉందనుకోవాల్సి వస్తోంది. తన పార్టీకంటూ కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పర్యటనకు జనసమీకరణ బాగానే కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా.. నేతలు తరలించారా.. ఏమైనా కూడా జనాలు బాగానే వచ్చారు. అయితే ఇది జగన్ మోహన్ రెడ్డి అంత ఆనందించదగిన అంశం అయితే కాదనుకోవాలి. ఎందుకంటే.. గోదావరి జిల్లాల్లో జగన్ కు ఈ తరహా స్పందన కొత్తేమీ కాదు!
గతంలో.. పార్టీ పెట్టిన కొత్తలో.. 2014 ఎన్నికలకు ముందు.. జగన్ తరచూ గోదావరి జిల్లాల్లో పర్యటించాడు. వివిధ రకాల యాత్రలతో అక్కడకు వెళ్లాడు. ఆ యాత్రలకు గొప్ప స్పందనే కనిపించింది. ఇసుకేస్తే రాలనంతగా జనాలు వచ్చారు జగన్ సభలకు. అయితే తీరా ఎన్నికల ఫలితాల్లో మాత్రం జగన్ పార్టీ గల్లంతయ్యింది! ఉభయగోదావరి జిల్లాలు జగన్ పార్టీకి గట్టి షాకునిచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తాజా పర్యటనకు జనస్పందన బాగానే ఉన్నా.. ఈ విషయంలో ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు వైకాపా అభిమానులు.