వేసవి తాపాన్ని తట్టుకోలేకో, లేదంటే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి విశ్రాంతి కోసమో, జగన్ విదేశాలకు చెక్కేస్తున్నారు. భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి అత్యంత శీతల ప్రదేశమైన స్విట్జర్లాండ్ కు వెళ్లి అక్కడి కుటుంబ సభ్యులతో పాటు ఆహ్లాదంగా 5 రోజుల పాటు గడపనున్నారు.
ఎలాంటి వ్యక్తి అయినా ఇలా కొద్ది రోజులపాటు సెలవులు గడపడం, కుటుంబంతో కలిసి సేదతీరడం సహజమే. అయితే జగన్ మానసపుత్రిక అయిన సాక్షి పేపర్, సాక్షి చానల్స్ – 2009 ఎన్నికలు అయిపోయిన వెంటనే, చిరంజీవి విదేశాలకు చెక్కేసేలా ఉన్నాడంటూ, అలా విదేశాలకు వెళ్లడం ప్రజా సేవ చేస్తున్న వారికి ఏ మాత్రం తగదు అన్నట్టు అర్థం వచ్చేలా కథనాలు రాశారు. అంతెందుకు ఎన్నికలు అవ్వగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ఒక మూడు నాలుగు రోజుల పర్యటనకోసం విదేశాలకు వెళ్లి ఉంటే దాని మీద సాక్షిలో ఎలాంటి కథనాలు వచ్చేవో అందరికీ తెలిసిన సంగతే.
గత ఏడాది కూడా కోర్టు అనుమతి తీసుకుని జగన్ ఇలాగే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈసారి స్విట్జర్లాండ్ వెళుతున్న జగన్ తిరిగి ఈ నెల 27వ తేదీన మళ్లీ భారతదేశానికి రానున్నారు.