కాపులకు గత ప్రభుత్వం కేటాయించిన ఐదు శాతం రిజర్వేషన్లను… ఏపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు కాపులకు 5 శాతం కోటా సాధ్యపడదని ప్రభుత్వం వాదిస్తోంది. అగ్రవర్ణ పేదలకు ధ్రువపత్రాలిచ్చే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. ఈ ఏడాది నుంచే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.
అసెంబ్లీ ఆమోదించినా ఏపీ సర్కార్కు వచ్చిన కష్టం ఏమిటి..?
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయించాలని.. గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లను ఈడబ్ల్యూఎస్ కోటాలో భాగంగా కల్పిస్తారు. మిగిలిన వారికి ఐదు శాతం ఇస్తారు. రిజర్వేషన్లలో మహిళలకు 33శాతం ఉంటుంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని పక్కన పెట్టిన.. కేంద్రం… ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. ఆ పది శాతం కోటాలో.. ఐదు శాతం కాపులకు ఇవ్వాలని నిర్ణయించింది.
కాపు కోటా వద్దని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది..?
కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మార్పులు చేయకూడదని.. సుప్రీంకోర్టు చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ.. సుప్రీంకోర్టు అలాంటి ఉత్తర్వులు ఎప్పుడూ ఇవ్వలేదు. కేంద్రం చేసిన చట్టం.. రిజర్వేషన్లు అమలు.. కేంద్రానికే పరిమితం. కేంద్రం భర్తీ చేసే ఉద్యోగాలు, విద్యాసంస్థలల్లో సీట్ల భర్తీ కోసం మాత్రమే అది చెల్లుబాటవుతుంది. రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే.. ఏపీలోని ఉద్యోగ, విద్యా ఇతర అంశాల్లో ఆ చట్టం అమలు చేయాలంటే.. ప్రభుత్వం ఓ పద్దతి ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో మార్పులు చేసుకోవచ్చని… పలు రాష్ట్రాలు చేస్తున్నది అదేనని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్ ఇప్పటికే కొన్ని మార్పులు చేసి అమల్లోకి తెచ్చింది.
అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా జగన్ ఐదు శాతం ఎందుకివ్వరు..?
ప్రస్తుతం అధికారికంగా చూస్తే.. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వ విధానం వేరుగా ఉంది. ఈ కోటాపై కోర్టుల్లో కేసులున్నాయి కానీ.. కోర్టులు తీర్పులు ఇవ్వలేదు. ఎక్కడా అమలు చేయకూడదని స్టేలు ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో యాథవిధిగా.. కోటా కిందట.. రిజర్వేషన్ సర్టిఫికెట్లు కాపులకు జారీ చేస్తే.. వారికి అన్ని రకాల ప్రయోజనం కలుగుతుంది. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. ఆ రిజర్వేషన్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. బీసీలకు ఆగ్రహిస్తారనో.. చంద్రబాబుకు పేరొస్తుందనో..ఏపీ సర్కార్.. వీటిపై వెనుకడుగు వేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.