బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ఆస్తులను తెగనమ్మాసని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొదటగా విశాఖ, గుంటూరుల్లోని అత్యంత ఖరీదైన స్థలాలను వేలానికి పెట్టింది. ఈ భూముల అమ్మి.. సొమ్ము చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను సృష్టించిన ఏపీ సర్కార్.. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుని అమ్మకాల్లో కమిషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. అమ్మి పెట్టాలంటూ..ఈ కంపెనీకి విశాఖ, గుంటూరుల్లోని 18.8 ఎకరాలను అప్పగించారు. వీటి విలువను రూ. 209 కోట్లుగా నిర్ణయించారు.
గుంటూరులో మార్కెట్.. విశాఖలో పోలీస్ క్వార్టర్స్ వేలం..!
గుంటురు, విశాఖల్లో అమ్ముతున్న భూములు నిరుపయోగంగా ఉన్నవి కావు. సిటీ మధ్యలో ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తున్న భూములు. గుంటూరు పట్టణంలో చిన్న మార్కెట్ అంటే.. తెలియని వారు ఉండరు. కొన్ని వందల మంది అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఆ చిన్న మార్కెట్‌ను.. అమ్మేస్తున్నారు. అలాగే గుంటూరు శివారు నల్లపాడులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఉన్న ఆరు ఎకరాల భూమిని… శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్మిక శాఖకు చెందిన మరో ఐదున్నర ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. విశాఖలో.. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌నే అమ్మకానికి పెట్టారు. వినియోగం లేక పాతబడిపోవడంతో.. అవి ఉపయోగం లేవన్న కారణం చూపి.. అమ్మకానికి పెట్టేశారు. ఇది బీచ్‌రోడ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. విశాఖలో పలు చోట్ల ఉన్న ఖరీదైన భూముల్ని అమ్మకానికి పెడుతున్నారు. అన్ని భూముల్ని రూ. రెండు వందల కోట్లుగా నిర్ణయించినప్పటికీ.. వేలంలో రూ. మూడు వందల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
సంక్షేమానికి అప్పులు – అభివృద్ధికి ఆస్తుల అమ్మకం..!
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వాటితో పాటు.. స్కూళ్లు, ఆస్పత్రులను నాడు, నేడు పేరుతో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. వీటన్నింటికీ నిధులు కావాలి. అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరుల్ని సమీకరించి… ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వనరులు అంటే.. అప్పులే. అవకాశం ఉన్న ప్రతీ చోటా అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్… నగదుపంపిణీ పథకాలకు ఖర్చు పెడుతోంది. అభివృద్ధి పనుల కోసం ఇప్పుడు.. ప్రజా వినియోగంలో ఉన్న భూములను అమ్మకానికి పెడుతోంది. ఇది ఆరంభమే.. ప్రభుత్వం యూనివర్శిటీల స్థలాలు సహా.. అనేకం అమ్మకాల జాబితాలో పెట్టుకుంది.
ఈ పరిస్థితుల్లో కొనుగోలు డిమాండ్ ఉంటుందా..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో భూముల్ని అమ్మి వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేశారు. అయితే అప్పుడు హైదరాబాద్‌లో రియల్ భూమ్ ఉంది. చంద్రబాబు ఐటీని అభివృద్ధి చేయడంతో కావాల్సినంత వనరులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ను వైఎస్ పెంచారు. కానీ ఏపీలో అన్నీ తిరోగమనంలో ఉన్నాయి. రాజధాని ఏదో క్లారిటీ లేకుండా పోయింది. అమరావతిని నిర్వీర్యం చేశారు.ఇలాంటి సమయంలో.. భూములపై వందల కోట్లు పెట్టుబడులు ఎవరైనా పెడతారా అన్నది సందేహమే. ఎలాంటిస్పందన ఉంటుందన్నదివేలంలో మాత్రమే తేలుతుంది…