పోలవరం విషయంలో తన చేతుల్లో ఏమీ లేదని అంతా కేంద్రం కడుతోందని జగన్ రెడ్డి చెప్పడం ప్రజల్ని నివ్వెర పరుస్తోంది. అధికారంలో ఉండితనకు చేతకాదు అని నిర్మోహమాటంగా చెప్పే బదులు రాజీనామా చేసి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. పోలవరం ఏపీ జీవనాడి ..అడ్డగోలుగా కాంట్రాక్టర్లను మార్చి ప్రాజెక్టును నాశనం చేయడేమ కాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కేంద్రం నుంచి తీసుకు రాలేక .. మొదటి దశ..రెండో దశ..మూడో దశ అంటూ ప్రాజెక్టు పుట్టి ముంచేస్తున్నారు. ఇలా సీఎంగా ఉంటూ ఓ రాష్ట్ర జీవనాడిని చంపేసేబదులు రాజీనామా చేసి వైదొలగడం అత్యుత్తమం అవుతుందని అంటున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిందేంటి ?
పోలవరం విషయంలో జగన్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు బాహుబలి రేంజ్ ప్రకటనలు చేశారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే .. రాష్ట్రం కట్టలేదా చంద్రబాబూ అంటూ రెచ్చిపోయారు. నిర్వాసితులకు అదనంగా ఎకరానికి పది లక్షల పరిహారం ఇస్తామన్నారు. ప్రాజెక్టును అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికి నాలుగున్నరేళ్లు అయినా ఆర్ అండ్ ఆర్ కాదు కదా కనీసం ప్రాజెక్టులో మూడు, నాలుగు శాతం పనులు కూడా చేయలేదు. విపక్షంలో చెప్పిన దానికి అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన దానికి అసలు పొంతన లేదు.. ఇంకా చెప్పాలంటే.. చేతకాక సర్వనాశనం చేశారు.
చేతులెత్తేసి … చేతకాదు అనడం ద్రోహం కాదా ?
అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తానని.. చంద్రబాబు అవినీతి చేశాడని నమ్మించి అధికారంలోకి వచ్చి చేసిందేమిటి ?. చంద్రబాబు హయాంలో అవినీతి జరగలేదని కేంద్రానికి రాసిచ్చారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టడం తన వల్ల కాదని చేతులెత్తేశారు. నిర్వాసితులకు ఇస్తామన్న డబ్బులూ ఇవ్వడం లేదు. నిర్వాసితుల్ని ఇంత ఘోరంగా మోసం చేసి… ఎన్నికలకు వెళ్లే ముందు ఇక తన వల్ల కాదని చేతులెత్తేయడం పాలకుడి లక్షణమా ?. నమ్ముకుని ఓట్లేసిన వారిని ముంచేయడం .. పరిపాలన చేయడమా ?
గిరిజనులు అమాయకులు… వారిని మోసం చేయడం క్షమించరాని రాని ద్రోహం !
పోలవరం కోసం త్యాగాలు చేస్తున్న వారంతా గిరిజనులు. వారిని నమ్మించి మోసం చేయడం క్షమించరాని ద్రోహం. ఓ సారి మోడీ డబ్బులు ప్రింట్ చేయడం లేదంటారు… మరో సారి ఖర్మకు మోడీ సర్కార్ ఉందంటారు.. ఈ కబుర్లన్నీ గిరిజనులను మోసం చేయడమే. వారికి హామీలు ఇచ్చినప్పుడు… పోలవరం గురించి కథలు చెప్పినప్పుడు ఇవన్నీ తెలియవా ?. అప్పట్లో మోసం చేయడానికే అలా చెప్పారా ?
రాష్ట్ర జీవనాడి శ్వాసను తీసేసి.. ఇంకా అధికారంలో ఎలా ఉంటారు ?
పోలవరం ఏపీ జీవనాడి. శరవేగంగా జరుగుతున్నప్రాజెక్టును పడకేసేలా చేసి నాలుగున్నరేళ్ల పాటు విధ్వంసం చేశారు. ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు అనే మాటే ఉండదు. సీమ ప్రజలూ కోనసీమ తరహా పంటలు పండించుకుంటారు. కానీ మొత్తం కలను చిదిమేశారు. చేతకాదని చేతులెత్తేస్తున్నారు. ఇంకా అధికారంలో ఎలా ఉంటారు ?