వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వణికిపోతున్న వారంతా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. సీబీఐ మీద ఆరోపణలు చేస్తూ… దర్యాప్తు అధికారుల మీద కేసులు పెడుతూ వీలైనంత వరకూ దర్యాప్తును ఆలస్యం చేయడంలో విజయం సాధించిన నిందితులు చివరికి దర్యాప్తు అధికారిని కూడా మార్పించగలిగారు. ఇక తమదే పైచేయి అనుకుంటున్న సమయంలో ఒక్క సారిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు సూత్రధారులు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే వారం పది రోజుల్లో సంచలనాలు ఉండే అవకాశం ఉంది. అసలు పూర్తిగా బయటపడ్డాం అనుకున్న కేసులో వెంటనే నిండా మునిగిపోయే పరిస్థితి ఎందుకొచ్చింది ?
ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకునేంత ధీమా – కానీ
అవినాష్ రెడ్డిని సీబీఐ రెండు సార్లు విచారణకు పిలిచే సరి ఇక అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు విచారణ అధికారిని మార్చాలని ఆదేశించడంతో ఆయన రిలాక్స్ అయ్యారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. దీనికి కారణం ఇక తనకు ముప్పు ఉండదని అనుకోవడమే. ఆ దిలాసా రెండు వారాల పాటు కొనసాగింది. కానీ తర్వాత ఫేట్ మారిపోయింది. వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఊహించని విధంగా సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త దర్యాప్తు బృందం ఇంత వేగంగా స్పందిస్తుందని అవినాష్ రెడ్డి క్యాంప్ కూడా అనుకోలేకపోయింది.
ఊహించనంత ఫాస్ట్ గా కొత్త సీబీఐ టీం చర్యలు
వివేకా హత్య కేసును చేధించడానికి … పోలీసులు గట్టిగా రెండురోజుల సమయంకూడా పట్టదు. ఎందుకంటే ఏ క్లూలు వదలకుండా జరిగిన హత్య కేసుల్లో పోలీసులు రెండు, మూడు రోజుల్లో చేధిస్తారు. అలాంటిది కళ్ల ఎదుట జరిగినట్లుగా స్పష్టంగా అన్నిరకాల ఆధారాలతో ఉన్న కేసును చేధించడం పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ అలా చేయకుండా అడ్డం పడే శక్తులు బలంగా ఉన్నాయి. పాత దర్యాప్తు అధికారి ఎస్పీ కేడర్ మాత్రమే. కానీ ఈ సారి ఆరుగురితో పవర్ ఫుల్ టీం ఏర్పాటు చేశారు. రెండు వారాలు సైలెంట్ గా ఉన్న సీబీఐ ఒక్కసారిగా జూలు విదిల్చింది.
కేంద్ర పెద్దల ఆదేశాలను జగన్ లెక్క చేయకపోవడంతోనే సీన్ మారిపోయిందా ?
వివేకా హత్య కేసులో ఎప్పుడుప్రధాన డెలవప్మెంట్ జరిగినా జగన్ ఢిల్లీ వెళ్లేవారు. తర్వాత పరిణామాలు సద్దుమణిగేవి. ఇటీవల కూడా అలాగే జరిగింది. ఇప్పుడు తిరగబడింది. దానికి కారణం ఉందని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తోంది. ఏపీలో జగన్ బీజేపీ పెద్దలు అత్యంత గౌరవంగా చూసే ఓ పెద్దమనిషిని టార్గెట్ చేశారు. తన చేతిలో ఉన్న అధికారంతో ఆయనను వేధిస్తున్నారు. ఈ విషయంలో పూర్తిగా తగ్గాలని బీజేపీ పెద్దల నుంచి వచ్చి నసూచనలు జగన్ పెడచెవిన పెట్టడంతో వారు కూడా ఇక మాటలతో పని లేదని తాము చేయాలనుకున్నది చేస్తున్నారని అంటున్నారు. అందుకే సీఎం జగన్ ఈ సారి ఢిల్లీకి కాకుండా… మరో మార్గాల ద్వారా కేసును తేలిక పర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కారణం ఏదైనా దర్యాప్తు సంస్థను మార్పించుకుని.. జగన్ అండ్ కో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయిందని చెప్పవచ్చు.